SRH Vs GT IPL 2025: ఇక ఈసారి జరిగిన మెగా వేలంలో బలమైన బ్యాటర్లను కావ్య మారన్ కొనుగోలు చేసింది. బౌలింగ్ విభాగంలోకి మహమ్మద్ షమీ రావడంతో హైదరాబాద్ జట్టుకు ఇక తిరుగు లేదని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే తొలి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు వీర విహారం చేసింది. సరికొత్త బెంచ్ మార్కు సృష్టించింది. 240+ స్కోర్ చేసి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. కానీ ఆ తర్వాత హైదరాబాద్ జట్టు అసలు రంగు బయటపడడం మొదలుపెట్టింది. ఆటగాళ్లు సరిగా ఆడలేక పోవడం.. కాటేరమ్మ కొడుకులకు ఎలివేషన్లు ఎక్కువ కావడంతో.. ఓటములు తప్పలేదు. పరాయి జట్ల వేదికలు మాత్రమే కాదు.. సొంత మైదానంపై కూడా హైదరాబాద్ జట్టు ఓటములు ఎదుర్కొంది. చివరికి పంజాబ్ జట్టుపై చేజింగ్ ద్వారా రెండవ విజయాన్ని అందుకున్న హైదరాబాద్.. మళ్లీ వరుసగా రెండు ఓటములను చవి చూడాల్సి వచ్చింది. ఈ దశలో చెన్నై పై సాధించిన గెలుపు కాస్త ఆశల నిలిపితే.. శుక్రవారం నాటి గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడంతో హైదరాబాద్ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పటికే ఐపీఎల్ లో గ్రూపు సమరం ముగింపు దశకు చేరుకుంది. ఈ సమరంలో ముంబై, బెంగళూరు, గుజరాత్, పంజాబ్ ముందంజలో ఉన్నాయి. అద్భుతాలు జరిగితే తప్ప ఈ జట్లు ప్లే ఆఫ్ వెళ్లిపోవడం ఖాయం.
Also Read: గుజరాత్ టైటాన్స్ సంచలనం.. ఐపీఎల్ లో సరికొత్త రికార్డు
దింపుడు కల్లం ఆశలు
హైదరాబాద్ జట్టు గుజరాత్ చేతిలో ఓడిపోయినప్పటికీ ప్లే ఆఫ్ వెళ్లడానికి కాస్త అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు పది మ్యాచ్లు ఆడింది. ఏకంగా ఏడు మ్యాచులలో ఓడిపోయింది. మూడు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన రాజస్థాన్.. పాయింట్లు పట్టికలో హైదరాబాద్ కంటే ఒక స్థానం మెరుగ్గా ఉండటం విశేషం.. హైదరాబాద్ తదుపరి నాలుగు మ్యాచ్లు ఆడాలి. ఈ నాలుగు మ్యాచ్లో కూడా అత్యంత భారీ తేడాతో ప్రత్యర్థి జట్లపై గెలుపొందాలి. అప్పుడు హైదరాబాద్ పాయింట్లు 14కు చేరుకుంటాయి.. అప్పుడు నెట్ రన్ రేట్ కూడా మెరుగవుతుంది.. గత సీజన్లో బెంగళూరు ఇదేవిధంగా ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయింది. మరి ఈసారి హైదరాబాద్ విషయంలో అదే జరుగుతుందా? హైదరాబాద్ బెంగళూరు మాదిరిగా రెచ్చిపోతుందా? పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు లేదు అని సమాధానం వస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ బ్యాటింగ్లో సత్తా చూపించడం లేదు. బౌలింగ్ లో వైవిధ్యాన్ని ప్రదర్శించడం లేదు. ఫీల్డింగ్ లో నిర్లక్ష్యాన్ని వదులుకోవడం లేదు. మరి ఇలాంటి ప్రతిబంధకాల మధ్య హైదరాబాద్ జట్టు తదుపరి నాలుగు మ్యాచ్లు భారీపలు తేడాతో గెలవడం.. మిగతా జట్లు విఫలం కావడం.. ప్లే ఆఫ్ దాకా వెళ్లడం.. ఇవన్నీ కూడా సమాధానాలు లేని ప్రశ్నలే.. చూడాలి మరి తదుపరి మ్యాచ్లలో కమిన్స్ సేన ఏం చేస్తుందో..