Srilanka Vs South Africa: టి20 ప్రపంచ కప్ లో రెండవ రోజు పెద్ద జట్లు తలపడ్డాయి.. అయినప్పటికీ నమీబియా, ఒమన్ స్థాయిలో టి20 మజా అందించలేకపోయాయి. దక్షిణాఫ్రికా, శ్రీలంక తలపడిన ఈ మ్యాచ్ లో.. పోరు హోరాహోరిగా సాగుతుందనుకుంటే.. పూర్తి ఏకపక్షంగా మారింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను విజయం వరించింది.. సమష్టిగా రాణించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా శ్రీలంక బ్యాటింగ్ చేసింది. కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. నోకియా 4/7, రబాడా 2/21, కేశవ్ మహారాజ్ 2/22 వికెట్లతో శ్రీలంక జట్టును వణికించారు. ఓట్ నిల్ బార్ట్ మాన్ ఒక వికెట్ పడగొట్టాడు. దక్షిణాఫ్రికా బౌలర్ల దూకుడుకు నలుగురు శ్రీలంక ఆటగాళ్లు 0 పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. శ్రీలంక ఆటగాళ్లలో కుశాల్ మెండిస్ చేసిన 19 పరుగులే హైయెస్ట్ స్కోర్. మాథ్యూస్ 16, కామెందు మెండిస్ 11 పరుగులు చేశారు. హసరంగ, విక్రమార్క, మతిషా పతిరణ, నువాన్ తుశారా సున్నా పరుగులకే అవుట్ అయ్యారు. నిస్సాంక 3, చరిత్ అసలంక 6, షనక 9, తీక్షణ 7* వంటి వారు సింగిల్ డిజిట్ వద్దే ఆగిపోయారు.
78 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 16.2 ఓవర్లలో.. నాలుగు వికెట్లు నష్టపోయి 80 పరుగులు చేసింది. మరో 22 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మైదానం బౌలింగ్ కు సహకరిస్తున్న నేపథ్యంలో.. సఫారీ ఆటగాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ 20, క్లాసెన్ 19* పరుగులు చేసి ఆకట్టుకున్నారు. మార్క్రం 12, హెండ్రిక్స్ 4 విఫలమైనప్పటికీ.. డేవిడ్ మిల్లర్ 6* చివరి వరకు నిలిచాడు.. శ్రీలంక బౌలర్లలో హాసరంగ 2/22 ఆకట్టుకున్నాడు.. తుషారా, షనక తలా ఒక వికెట్ తీశారు.
వాస్తవానికి శ్రీలంక ఈ మ్యాచ్ ఓడిపోయిందంటే దానికి ప్రధాన కారణం కెప్టెన్ హసరంగ తీసుకొన్న నిర్ణయమే. టాస్ గెలిచిన అతడు.. మైదానాన్ని సరిగా అంచనా వేయకుండానే బ్యాటింగ్ వైపు మొగ్గాడు. వాస్తవానికి ఈ పిచ్ బౌలర్లకు పూర్తిగా సహకరిస్తోంది. వాస్తవానికి శ్రీలంక జట్టు 100+ పరుగులు చేసినా కచ్చితంగా గెలిచేది.. రెండు బలమైన జట్లే అయినప్పటికీ..5 ఫోర్లు, 6 సిక్స్ లు నమోదయ్యాయంటే మైదానం ఎంత విభిన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాటర్లు బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడగా.. బౌలర్లు మాత్రం వైవిధ్యమైన బంతులు వేసి వికెట్లు పడగొట్టారు.