Yashaswi Jayaswal Century Miss: ఇప్పుడు ఐపీఎల్‌లో చర్చంతా రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పైనే. వీరబాదుడుతో 13 బంతుల్లోనే అర్ధశతకం చేసిన ఈ కుర్రాడు.. సెంచరీని మాత్రం మిస్ చేసుకున్నాడు. దీంతో కోల్‌కతా బౌలర్‌పై విమర్శలు మొదలయ్యాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్విజైస్వాల్ తన విధ్వంసంతో సరికొత్త రికార్డు సృష్టించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లో 50 మార్కును అందుకుని 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. కానీ, ఈ సీజన్‌లో సెంచరీ చేసే అవకాశం అతడికి రెండోసారి మిస్ అయ్యింది. గురువారం నాటి మ్యాచ్‌లో యశస్వి 98 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో అటు రాజస్థాన్ ఆటగాళ్లు, అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు.
కోల్‌కతా బౌలరే కారణమని..
యశస్వి సెంచరీ మిస్‌కు కోల్‌కతా స్పిన్నర్ సుయాశ్ శర్మ కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. యశస్వీ శతకాన్ని అడ్డుకునే ఉద్దేశంతో అతడు వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ సుయాశ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మ్యాచ్‌లో 13వ ఓవర్ ఆఖరి బంతి పడే ముందు రాజస్థాన్ 147 పరుగులతో విజయానికి కేవలం 3 పరుగుల దూరంలో ఉంది. అప్పటికి యశస్వి స్కోరు 94. ఇంకో సిక్స్ కొడితే సెంచరీ తన ఖాతాలో పడుతుంది. కానీ, క్రీజులో సంజూ శాంసన్ ఉన్నాడు. గెలుపు ఎలాగూ లాంఛనమే కాబట్టి.. ఆ ఒక్క బంతికి భారీ షాట్ కొట్టకుండా ఉంటే.. తర్వాతి ఓవర్‌లో యశస్వీ క్రీజులోకి వచ్చి సెంచరీ పూర్తి చేసుకుంటాడని సంజూ భావించాడు. అయితే, ఆ ఓవర్‌లో బౌలింగ్ చేసిన కోల్‌కతా స్పిన్నర్ సయాశ్ శర్మ.. చివరి బంతిని వైడ్ వేసేందుకు ప్రయత్నించాడు. ఆ బంతి కీపర్‌కు అందకుండా బౌండరీకి వెళ్లే అవకాశం ఉండేది. అదే జరిగితే జైస్వాల్ 94 దగ్గరే ఉండిపోయేవాడు.
చాకచక్యంగా వ్యవహరించిన సంజూ శాంసన్..
అయితే, ఆ బంతి గమనాన్ని గుర్తించిన సంజూ శాంసన్ అదనపు పరుగు రాకుండా.. చాకచక్యంగా బంతిని ఎదుర్కొని పరుగు కూడా తీయలేదు. ఆ తర్వాత సంజూ.. యశస్వివైపు చూస్తూ సిక్స్ బాదేసెయ్ అంటూ సైగ చేశాడు. తర్వాతి ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ తొలి బంతిని వైడ్ యార్కర్ వేసే ప్రయత్నం చేయగా.. జైస్వాల్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి తరలించి రాజస్థాన్‌కు విజయాన్నందించాడు. దీంతో యశస్వి 98 పరుగుల వద్ద ఆగిపోయాడు.
ఆకాశ్‌చోప్రా అసహనం..
దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. సుయాశ్ ప్రయత్నంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘యశస్వి సెంచరీ చేయకుండా అడ్డుకోవడం కోసం వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించడం చాలా చెడు ఆలోచనని అని నా అభిప్రాయం. ఊహించుకోండి.. ఒకవేళ కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు ఓ పాకిస్థాన్ బౌలర్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది? బౌలర్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని కొందరు చెప్పినప్పటికీ.. ఆ బౌలర్ మాత్రం క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వెళతాడు. ట్రోలింగ్ లెవల్ కూడా మామూలుగా ఉండదు’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.
రన్‌రేట్ పెంచాలనే దూకుడు..
ఇక మ్యాచ్ అనంతరం యశస్వి మాట్లాడుతూ.. ‘సెంచరీ చేయాలన్నది తన ఆలోచన కాదని, జట్టు నెట్ రన్‌రేట్‌ను పెంచడం కోసమే దూకుడుగా ఆడాను’ అని చెప్పాడు. ‘మ్యాచ్ కోసం నేను సంసిద్ధమయ్యా. నా మీద పూర్తి విశ్వాసంతో ఆడా. మంచి ఫలితం వస్తుందని నాకు తెలుసు. ఎప్పుడూ మ్యాచ్‌ను నేనే పూర్తిచేయాలని కోరుకుంటా. గెలవడమే నా సిద్ధాంతం. ఈ మ్యాచ్‌లో నెట్ రన్‌రేట్‌ను దృష్టిలో పెట్టుకుని ఆడా. నేనూ, సంజూ కలిసి వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాం’ అని చెప్పాడు.