https://oktelugu.com/

IPL Black Tickets : పేరుకు సాప్ట్ వేర్ ఉద్యోగులు.. చేసేది ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా.. పోలీసులకు చిక్కారిలా..

వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి మాధ్యమాలలో తమ బ్లాక్ టికెట్లకు సంబంధించి ప్రకటనలు ఇవ్వడంతో.. పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఆ ఇద్దరూ నిందితులు గతంలో కూడా ఇదేవిధంగా బ్లాక్ లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతుండగా చెన్నై పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అయితే అరెస్ట్ అయిన వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 26, 2024 / 09:28 PM IST

    IPL Black Tickets

    Follow us on

    IPL Black Tickets : డబ్బు సంపాదించాలి.. అది ఎలాగైనా సరే.. ఓవర్ నైట్ లో మిలియనీర్ అయిపోవాలి.. సకల సౌకర్యాలు అనుభవించాలి.. ఫిలాసవంతమైన జీవితాన్ని కొనసాగించాలి.. ఇవన్నీ జరగాలంటే కష్టపడాలి. దానికి అదృష్టం కూడా జతవ్వాలి. కానీ, వారు పై వాటిని కాకుండా అక్రమ మార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను పక్కనపెట్టి ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా షురూ చేశారు. ఆ తర్వాత పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

    హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరిగినా టికెట్ల కొరత ఉండదు. కానీ ఇటీవల జరిగిన మ్యాచ్లలో ఆ కొరత ఏర్పడింది. టికెట్లు లభించక అభిమానులు చాలా ఇబ్బంది పడ్డారు. దీనిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా షాక్ కు గురైంది. వాస్తవానికి ఈ టికెట్ విక్రయాలను పేటియం సంస్థ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో ఏమాత్రం సంబంధం లేకుండా విక్రయిస్తుంది. మ్యాచ్ కు ముందే విక్రయాలు పూర్తవుతాయి. అయితే ఇటీవల టికెట్లను పేటీఎం సంస్థ ఆన్లైన్ లో పెట్టిన కొద్ది నిమిషాలకే.. అయిపోయాయని బోర్డు పెడుతోంది. అయితే ఆన్లైన్లో పెట్టిన కొద్ది నిమిషాలకే టికెట్లు అమ్ముడుపోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్లాన్ ప్రకారం బ్లాక్లో పెట్టిందని ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ ఆరోపణలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొట్టి పారేసింది. మరోవైపు పేటీఎం నిర్వాహకులు కూడా అభిమానుల్లో ఉన్న క్రేజ్ కారణంగా టికెట్లు వెంటనే అమ్ముడుపోతున్నాయని ప్రకటించారు. అయితే వారి మాటలను పోలీసులు నమ్మలేదు. లోతుగా తవ్వితే కీలక విషయాలు వెలుగు చూసాయి.

    హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా షురూ చేశారు. పేటీఎం సంస్థ ఆన్లైన్లో టికెట్లు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే వాటిని కొనుగోలు చేసి.. బ్లాక్లో విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి నాలుగు లేదా ఆరు టికెట్లు మాత్రమే విక్రయించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్రమ మార్గంలో పేటీఎం నిర్వాహకుల ఐడి పాస్వర్డ్ సేకరించారు. ఇంకేముంది తమకున్న పరిజ్ఞానంతో నిమిషాల వ్యవధిలోనే 1000 పైగా టికెట్లను బ్లాక్ మార్గంలో విక్రయించారు. ఫలితంగా ఇతర అభిమానులకు టికెట్లు లభించే అవకాశం లేకుండా పోయింది. ఇలా ఆన్లైన్లో టికెట్లు విక్రయించిన వారు క్యూఆర్ కోడ్ తీసుకొని హైదరాబాదులోని జింఖానా మైదానం వెళ్తారు. అక్కడ క్యూఆర్ కోడ్ తీసుకొని టికెట్లు పొందుతారు. అలా వారి చేతికి వచ్చిన టిక్కెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నారు. వారి వద్ద నుంచి హైదరాబాద్ పోలీసులు వందకు పైగా టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి మాధ్యమాలలో తమ బ్లాక్ టికెట్లకు సంబంధించి ప్రకటనలు ఇవ్వడంతో.. పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఆ ఇద్దరూ నిందితులు గతంలో కూడా ఇదేవిధంగా బ్లాక్ లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతుండగా చెన్నై పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అయితే అరెస్ట్ అయిన వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.