Shubman Gill : ఐపీఎల్-16వ సీజన్ శుబ్‌మన్ గిల్‌కు ఎప్పటికి గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ కొడుతుందో లేదో తెలియదు కానీ గిల్‌కు మాత్రం కెరీర్‌లో బెస్ట్ టోర్నీగా మిగిలిపోతుంది. సోమవారం సీఎస్‌కేతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సెంచరీ బాదుతాడని గుజరాత్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. కానీ ధోని సూపర్ ఫాస్ట్ స్టంపింగ్‌కు 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది.
అరెంజ్ క్యాప్ ఖాయం..
ఈ క్రమంలో గిల్ ఆరెంజ్ క్యాప్ అందుకోవడం ఖాయమైంది. అతనికి సమీపంలో ఎవరూ లేరు. మరోవైపు శుబ్‌మన్ గిల్ ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈసీజన్‌లో గిల్ 17 మ్యాచ్‌లు ఆడిన గిల్ 890 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున కోహ్లి 973 పరుగులు సాధించాడు.
కోహ్లిపేరిటే రికారు‍్డ..
ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ కోహ్లి చేసిన పరుగులే అత్యుత్తమం. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. తొలి టీమిండియా బ్యాటర్ రికార్డు కోహ్లి పేరిటే ఉంది. కోహ్లి, గిల్ తర్వాత జాస్ బట్లర్ 863 పరుగులు(రాజస్తాన్ రాయల్స్, 2022), డేవిడ్ వార్నర్ 848 పరుగులు(ఎస్‌ఆర్‌హెచ్, 2016), కేన్ విలియమ్సన్ 735 పరుగులు(ఎస్‌ఆర్‌హెచ్, 2018) వరుసగా ఉన్నారు.
గిల్ బౌండరీల రికార్డు..
ఇక ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక బౌండరీలు బాదిన జాబితాలోనూ గిల్ చోట సంపాదించాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో గిల్ గుజరాత్ టైటాన్స్ తరపున 118 బౌండరీలు బాదాడు. ఓవరాల్ జాబితాలో గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక జాస్ బట్లర్ 128 బౌండరీలతో(రాజస్తాన్ రాయల్స్, 2022లో) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 122 బౌండరీలు(ఆర్‌సీబీ, 2016లో), డేవిడ్ వార్నర్ 119 బౌండరీలు(ఎస్‌ఆర్‌హెచ్, 2016లో) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.