Shubman Gill Injury: ఐడిఎఫ్సి టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా జట్టుతో కోల్ కతా వేదికగా తొలి టెస్ట్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 159 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్ల లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు.. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగుల ఆధిక్యం భారత జట్టుకు లభించింది.
టీమిండియాలో కెప్టెన్ గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెను తిరిగాడు. అతడు కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఉన్నట్టుండి గిల్ పెవిలియన్ వెళ్లిపోవడం పట్ల ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాస్తవానికి గిల్ ను బంతి తగలలేదు. దక్షిణాఫ్రికా ఫీల్డర్లు వచ్చి తాకలేదు. అలా ఏమీ జరగకుండానే అతడు పెవిలియన్ వెళ్లిపోవడం పట్ల విస్మయం వ్యక్తం అయింది.
గిల్ మెడనొప్పి వల్ల వెనక్కి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.. కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొని అతడు పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో అతడు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యాడు. అతడిని ప్రస్తుతం వైద్యులు పరీక్షిస్తున్నారు.. తుది నివేదిక వచ్చిన తర్వాత అతను ఆడతాడా? లేదా? అనేది తెలుస్తుందని బిసిసిఐ వర్గాలు చెబుతున్నాయి. మెడ కండరాలు పట్టేయడం వల్ల గిల్ ఇబ్బంది పడినట్టు.. అందువల్లే అతడు బ్యాటింగ్ చేయలేదని బిసిసిఐ వర్గాలు అంటున్నాయి. తుది నివేదిక వచ్చిన తర్వాత అతడు ఆడే విషయంపై క్లారిటీ వస్తుందని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 189 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 39, సుందర్ 29, పంత్ 27, రవీంద్ర జడేజా 27 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా జట్టులో సిమోన్ 4, జాన్సన్ మూడు వికెట్లు సాధించారు. కేశవ్ మహారాజ్, బోస్ చెరో వికెట్ సాధించారు. పిచ్ బౌలర్లకు సంపూర్ణంగా సహకరిస్తున్న నేపథ్యంలో బ్యాటర్లు బ్యాటింగ్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. దక్షిణాఫ్రికా బ్యాటర్లు పడినట్టుగానే టీం ఇండియా బ్యాటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంతులు వేగంగా దూసుకురావడంతో పరుగులు తీయడం కాదు కదా.. కనీసం క్రీజ్ లో ఉండడమే బ్యాటర్లకు గగనమైపోయింది.. అయితే రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టును కట్టడి చేసే విధానం.. ఆ లక్ష్యాన్ని సాధించే తీరును బట్టి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.