Modi Bihar migrants: బీహార్ రాష్ట్రంలో అద్భుతమైన వనరులు ఉన్నాయి. కష్టపడి పని చేసే మనుషులు ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు అత్యంత దరిద్రంగా ఆ ప్రాంత చరిత్రను సర్వనాశనం చేశారు. ఔన్నత్యాన్ని కాలగర్భంలో కలిపేశారు. బీహార్ అంటే నలంద విశ్వవిద్యాలయం గుర్తుకు రావాల్సిన చోట కులాల కుమ్ములాటలు, వర్గాల తోపులాటలు, దోపిడీలు, దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. ప్రజలు కొట్లాడుకుంటుంటే.. రాజకీయ నాయకులు వినోదం చూసేవారు.. వారు కులాల కుంపట్లలో రగిలి పోతుంటే.. ఆ మంటల ద్వారా చలికాచుకునేవారు.
బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అక్కడి ప్రజల్లో సరికొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి. ప్రభుత్వంపై ఆశలు పెరుగుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో తామర పంట విరివిగా సాగవుతుంది. ముఖ్యంగా సీమాంచల్ – కోసి ప్రాంతంలో విస్తారంగా నీటి వనరులు ఉంటాయి. ఇక్కడ తామర పంట విరివిగా సాగవుతుంది. తామర గింజలను సేకరించి.. ఎండబెట్టి.. వేయిస్తారు. వాటిని మఖానా అంటారు. వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. గతంలో ఈ ప్రాంతంలో కొంత పరిధి మేర మాత్రమే ఈ పంట సాగులో ఉండేది. కానీ ఇప్పుడు మూడింతలు పెరిగింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడ్జెట్లో మఖాన పంటకు కేటాయింపులు జరిపారు. తద్వారా ఆ పంటను సాగుచేసే రైతులు పెరిగిపోయారు.
కేవలం సీమాంచల్ ప్రాంతంలోనే కాదు.. బీహార్ రాష్ట్రంలోని ఆరు రీజియన్లలో అద్భుతమైన వనరులు ఉన్నాయి. అయితే వాటికి తగ్గట్టుగా కర్మగారాలు బీహార్ ప్రాంతంలో లేవు. బీహార్ ప్రాంతంలో కర్మ గారాలను ఏర్పాటు చేయాలని ఏ ప్రభుత్వం కూడా పెద్దగా ఆలోచించలేదు. దీంతో ఇక్కడ ప్రజలు ఉపాధి లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. బీహార్ రాష్ట్రంలో విస్తారంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి.. వలసలకు అడ్డుకట్ట వేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీహార్ రాష్ట్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికలు పూర్తి కావడంతో వారు మళ్లీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బీహార్ ముఖచిత్రం మారడం లేదు. వరద జీవుల బతుకులు మారడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించాలని.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కంపెనీలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి కల్పించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రానికి కేటాయింపులు పెంచారు. ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నేపథ్యంలో కేటాయింపులు మరింతగా పెంచి బీహార్ కు ఉన్న బీమారి పేరును రూపుమాపాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.