https://oktelugu.com/

Sanju Samson: సున్నాలు చుట్టి రావడంలో తిరుగులేని రికార్డు.. సంజును ఇలా ఆడుకుంటున్నారేంటి?!

బంగ్లాదేశ్ పై సెంచరీ.. దక్షిణాఫ్రికా పై సెంచరీ.. ఇక తిరుగులేదు.. అతడికి అడ్డు అనేది లేదు.. జట్టులో ఇకపై స్థానం సుస్థిరం.. అతని ఆట పదిలం. అతని నైపుణ్యం అమోఘం.. సంజు శాంసన్ వరుసగా రెండు సెంచరీలు చేసిన తర్వాత మీడియా ఇలాగే వ్యాఖ్యానించింది. కానీ ఇప్పుడు..

Written By: Anabothula Bhaskar, Updated On : November 14, 2024 10:26 am

Sanju Samson

Follow us on

Sanju Samson: దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన సంజు.. ఆ తర్వాత రెండు మ్యాచ్లలో 0 చుట్టాడు. జట్టుకు బలమైన పునాది వేయాల్సిన చోట.. 0 పరుగులకు చేతులెత్తేశాడు. ఫలితంగా “సిల్వర్ డక్” చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. మూడవ టి20 మ్యాచ్ దక్షిణాఫ్రికా – భారత్ జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ నెగ్గింది. మరో మాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకుంది. అయితే మార్కో జాన్సన్ వేసిన తొలి ఓవర్ రెండవ బంతికి సంజు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జాన్సన్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన సంజు.. అత్యంత దారుణంగా వికెట్ సమర్పించుకున్నాడు. ఇలా అవుట్ అవ్వడం ద్వారా సంజు అత్యంత దారుణమైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇంటర్నేషనల్ టి20 లలో ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువసార్లు 0 పరుగులకు అవుట్ అయిన ఆటగాడిగా సంజు రికార్డు సృష్టించాడు.

ఐదు సార్లు డక్ ఔట్

సంజు శాంసన్ ఈ ఏడాది అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఐదు సార్లు 0 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ ఏడాది మొదట్లో ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సంజు 0 పరుగులకే వెనుతిరిగాడు. అనంతరం జూలై నెలలో శ్రీలంక జట్టుతో జరిగిన టి20 సిరీస్లో రెండు మ్యాచ్ లలోనూ సంజు 0 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండు మ్యాచ్ లలోనూ సంజు 0 పరుగులకే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో ఒకే సంవత్సరంలో ఎక్కువసార్లు సున్నా పరుగులకే వెనుదిరిగిన తొలి ఆటగాడిగా అత్యంత చత్త రికార్డును సంజు మూట కట్టుకున్నాడు.. మొత్తంగా చూస్తే టి20 లలో సంజు ఇప్పటివరకు ఆరుసార్లు సున్నా పరుగులకు అవుట్ అయ్యాడు.. టి20 లలో ఎక్కువసార్లు డక్ అవుట్ అయిన భారత క్రికెటర్ల జాబితాలో సంజు మూడో స్థానంలో ఉన్నాడు. 12సార్లు డక్ అవుట్ అయి రోహిత్ శర్మ ఈ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఏడుసార్లు డక్ ఔట్ అయ్యి విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు..

ఇక ఇటీవల సంజు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసినప్పుడు ఆయన తండ్రి శాంసన్ విశ్వనాథ్ స్పందించారు. తన కుమారుడు అద్భుతమైన క్రికెటర్ అని.. కానీ అతనికి అవకాశాలు ఇవ్వడంలో రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పక్షపాతం చూపించారని ఆరోపించాడు.. తన కుమారుడికి ఇప్పటికైనా అవకాశాలు లభిస్తున్నాయని.. దీనికి సూర్య కుమార్ యాదవ్, గౌతమ్ గంభీరే కారణమని అతడు వ్యాఖ్యానించాడు.. సంజు రెండుసార్లు డక్ ఔట్ కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఇలా అవుట్ అయితే ఎలా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.