Sanju Samson: మామూలు కొట్టుడు కాదది. ఎలాంటి ఉపమానాలు ఉపయోగించినా సరిపోదు. ఎలాంటి ఉపోద్ఘాతంతో వర్ణించినా సరిపోదు. ఎందుకంటే అతని బ్యాటింగ్ అలా ఉంది మరి. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తుంటే ప్రత్యర్థి బౌలర్లు సైలెంట్ అయిపోతున్నారు. జస్ట్ చూస్తూ ఉండిపోతున్నారు. మైదానం బయట ఉన్న ప్రేక్షకుల మాదిరిగానే వారు కూడా ప్రేక్షక పాత్రకు పరిమితమవుతున్నారు. అలా ఆడుతున్న ఆటగాడు మరెవరో కాదు.. సంజు శాంసన్.
Also Read: వర్షం పడింది.. కండోమ్ ల కథ బయటపడింది
కొచ్చి బ్లూ టైగర్స్ తరఫున..
కేరళ క్రికెట్ లీగ్ లో కొచ్చి బ్లూ టైగర్స్ తరఫున సంజు శాంసన్ ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడు భీకరమైన ఫామ్ లో ఉన్నాడు.. ఈ లీగ్ లో భాగంగా అదాని త్రివేండ్రం రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో సంజు ఆర్థ శతకం చేశాడు. కేవలం 37 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 62 పరుగులు చేశాడు. ఈ లీగ్ లో అంతకుముందు త్రిసూర్ టైటాన్స్ జట్టుపై 89.. కొల్లం జట్టుపై 121 పరుగులు చేశాడు. తద్వారా తన తిరుగులేని ఫామ్ తో టీమిండియా ఓపెనర్ స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నాడు సంజు.
అదరగొడుతున్నాడు
సంజు పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడతాడు. ఇటీవల ఐపీఎల్లో గాయం బారిన పడ్డప్పటికీ.. త్వరగానే కోలుకున్నాడు. ఇటీవల ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. సంజు గాయపడిన నేపథ్యంలో అతడు జట్టుకు దూరమయ్యాడు. చివరికి గాయం నుంచి కోలుకుని సూపర్ ఫామ్ అందుకున్నాడు. త్వరలో జరిగే ఆసియా కప్ లో అతడు ఆడబోతున్నాడు. అయితే ఇప్పుడున్న ఫాం ప్రకారం అతడిని ఓపెనర్ గా తీసుకుంటారా.. లేదా సెకండ్ లేదా థర్డ్ పొజిషన్లో ఆడిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇక ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్లో సంజు బీభత్సమైన ఆట తీరు కొనసాగించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి అదరగొట్టాడు.
స్థిరంగా ఫామ్ కొనసాగిస్తున్నాడు
కొద్దిరోజుల నుంచి సంజు తన ఫామ్ స్థిరంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ మినహా మిగతా అన్ని సిరీస్లలో అదిరిపోయే ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. జట్టుకు దూరం కావడంతో అతడిలో విపరీతమైన కసి పెరిగిపోయింది. దీంతో రోజా తరబడి నెట్స్ లోనే సాధన చేశాడు. తనను తాను నిరూపించుకున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. తద్వారా తిరుగులేని ఆటగాడిగా మారిపోయాడు.. జట్టు మేనేజ్మెంట్ కు మరో అవకాశం లేకుండా చేశాడు.