T20 World Cup 2024: ఐపీఎల్ హడావిడి ముగిసింది.. మరి కొద్ది రోజుల్లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.. ఇప్పటికే భారత జట్టులో ఒక బృందం అమెరికా వెళ్లిపోయింది. అక్కడ ముమ్మరంగా సాధన చేస్తోంది.. భారత్ మాత్రమే కాకుండా మిగతా జట్లు కూడా అమెరికా వెళ్ళిపోయాయి. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాయి.. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. టి20 వరల్డ్ ర్యాంకింగ్స్ లో భారత జట్టు నెంబర్ వన్ స్థానంలో ఉండడం కూడా ఇందుకు ఒక కారణం.
టి20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే జట్టుకు సంబంధించి ఇటీవలే బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఇద్దరు యువ ఆటగాళ్లు సంజు శాంసన్, రిషబ్ పంత్ కు అవకాశం లభించింది.. అయితే తుది జట్టులో రిషబ్ కంటే సంజు కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. వాస్తవానికి రిషబ్, సంజు ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలరు. అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్ లో సత్తా చాటగలరు.. అయితే గణాంకాలను పరిశీలిస్తే సంజునే వికెట్ కీపింగ్ కు అర్హుడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్.. కోలుకున్న తర్వాత.. అనేరుగా ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. అంతేకాదు ఆ జట్టును ముందుండి నడిపించాడు. ఈ క్రమంలో అతడి ఆట తీరు నచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశారు. ఫాస్ట్ బౌలింగ్లో బీభత్సంగా ఆడుతున్న రిషబ్.. స్పిన్ బౌలింగ్ లో తేలిపోతున్నాడు. ఇటీవలి ఐపిఎల్ సీజన్లో ఏకంగా ఐదుసార్లు స్పిన్ బౌలర్ల చేతిలో పంత్ అవుట్ అయ్యాడు.. ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన పంత్.. 446 రన్స్ చేశాడు.. అతడి స్ట్రైక్ రేట్ 115 గా ఉంది. అయితే ఇందులో స్పిన్నర్ల కంటే పేస్ బౌలర్ల పైనే అతడు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.. స్పిన్నర్ల బౌలింగ్లో పంత్ డాట్ బాల్స్ 35 శాతం గా ఉండడం గమనార్హం.
సంజు స్పిన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇటీవలి ఐపిఎల్ ఎడిషన్లో కేవలం రెండుసార్లు మాత్రమే స్పిన్ బౌలర్ల చేతిలో అవుట్ అయ్యాడు. అది కూడా ప్లే ఆఫ్ మ్యాచ్లలో కావడం విశేషం. మిగతా మ్యాచ్లలో పేస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 150 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. ఏకంగా 531 రన్స్ చేశాడు. ఇక ఇతడి డాట్ బాల్ పర్సంటేజ్ 19 గా ఉంది. సంజు అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్ లో అద్భుతమైన ప్రతిభను చాటాడు. కోల్ కతా కెప్టెన్ గా జట్టను ముందుండి నడిపించాడు.
రిషబ్ కంటే సంజు మెరుగ్గా ఉన్నాడు కాబట్టి.. తుది జట్టులో అతడికే అవకాశం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. టి20 వరల్డ్ కప్ కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ రెండు దేశాల్లో మైదానాలు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. ఇది రిషబ్ పంత్ కు ఒకరకంగా ప్రతిబంధకం. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ ను రిషబ్ ఎదుర్కోలేడనే అపవాదు ఉంది.. సంజు మాత్రం స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగగలడు. అతడి గణాంకాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరిలో రోహిత్ శర్మ ఎవరి వైపు మొగ్గు చూపుతాడనేది ఆసక్తి కరం.