Sanju Samson leaves RR: ఐపీఎల్ మినీ వేలానికి ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ అన్ని జట్లు ఇప్పుడే రెడీ అవుతున్నాయి. ప్లేయర్ల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాయి. భారీ అంచనాలు పెట్టుకున్న ప్లేయర్లు సరిగ్గా ఆడకపోతుండడంతో వారిని పొమ్మన లేక పొగ పెడుతున్నాయి. ట్రేడ్ నిబంధనలలో భాగంగా కొంతమంది ప్లేయర్లను ఇతర జట్ల నుంచి తీసుకుంటున్నాయి. తాజాగా చెన్నై జట్టు ఓ ప్లేయర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. దానికోసం ఒక సీనియర్ ఆటగాడిని వదులుకోవడానికి సిద్ధపడింది.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. చెన్నై జట్టులో ధోని తర్వాత ఆ స్థాయి ఆటగాడిగా రవీంద్ర జడేజాకు పేరు ఉంది. క్రికెట్ ను అత్యంత దగ్గరగా ఫాలో అయ్యే అభిమానులకు ధోని, జడేజా మధ్య ఉన్న స్నేహాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు . అయితే చెన్నై జట్టు యాజమాన్యం రాజస్థాన్ సారథి సంజు శాంసన్ కోసం రవీంద్ర జడేజాను వదులుకోవడానికి సిద్ధపడింది. దానికి అతడు కూడా ఓకే చెప్పడంతో చెన్నై జట్టు నుంచి జడేజా రాజస్థాన్ వెళ్లిపోయినట్టే. దీనికి సంబంధించిన ఒప్పందలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ జట్టుకు నాయకుడిగా సంజు ఉన్నాడు. అతడు చెన్నై జట్టులోకి వస్తే.. రాజస్థాన్ జట్టుకు సారధి అయ్యేది ఎవరనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
సంజు రాజస్థాన్ నుంచి వెళ్ళిపోతే కొత్త సారధిగా ధృవ్ జూరెల్ లేదా యశస్వి జైస్వాల్ ను నియమించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారధి అవ్వడానికి వీరిద్దరు ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది. జైస్వాల్ రాజస్థాన్ జట్టుకు ఓపెనర్ గా కొనసాగుతున్నాడు. అతడు ఆ జట్టు తరఫున పరుగుల వరద పారించాడు. 2025 సీజన్లో రాజస్థాన్ జట్టు తరుపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రాజస్థాన్ మేనేజ్మెంట్ జైస్వాల్ కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అతడు కాదనుకుంటే జూరెల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.. ఎందుకంటే జూరెల్ సమర్థవంతమైన వికెట్ కీపర్. వేగంగా బ్యాటింగ్ చేస్తాడు. జట్టు పరిస్థితికి తగ్గట్టుగా పరుగులు సాధిస్తాడు. జైస్వాల్ లేదా జురెల్ ఎవరైనా సరే సారధి అయితే రాజస్థాన్ జట్టు స్వరూపం పూర్తిగా మారిపోతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఐపీఎల్ ప్రారంభమైన సంవత్సరంలో షేన్ వార్న్ ఆధ్వర్యంలో రాజస్థాన్ జట్టు విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పటివరకు ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. అనేక పర్యాయాలు కొత్త ప్లేయర్లతో జట్టును నింపినప్పటికీ ఊహించిన స్థాయిలో ఫలితం మాత్రం రాలేదు. అయితే ఈసారి గత చరిత్రకు చరమగీతం పాడి.. విజేతగా నిలవాలని రాజస్థాన్ జట్టు యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తోంది.