Rohith Sharma : ప్రస్తుత ఐపిఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ.. మొదట్లో అంతగా సత్తా చూపించలేకపోయాడు. ఆ తర్వాత తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ముంబై జట్టు సాధించిన విజయాలలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. సరిగ్గా ఏప్రిల్ 16న జరిగిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ” ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ లో నా వంతు పాత్ర పోషిస్తాను. జట్టుకు నా వంతుగా ఉత్తమ ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నం చేస్తాను. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడతాను. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. రెడ్ బాల్ ఫార్మాట్లో నా ఆట తీరు కొంతకాలంగా బాగాలేదు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్లో నా వంతుగా ఉత్తమ ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నానని” రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.. ఇక ఇది జరిగిన కొద్ది రోజులకే అంటే ఏప్రిల్ 21న రోహిత్ శర్మకు ఎప్పటిలాగే బీసీసీఐ A+ కేటగిరి ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టులో అతడికి ఆ స్థానం కల్పించింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా కు అందులో చోటు కల్పించింది. ఏ ప్లస్ కేటగిరీలో ఒక్కో ఆటగాడికి బీసీసీఐ ప్రతి ఏడాది ఏడు కోట్ల వార్షిక వేతనాన్ని చెల్లిస్తుంది. రోహిత్ శర్మ ఏ ప్లస్ కేటగిరిలో చేర్చిన సరిగ్గా రెండు వారాలకే బీసీసీఐ సెలక్షన్ కమిటీ తన తీరు మార్చుకుంది. తన నిర్ణయాన్ని సవరించుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచించింది. దానికి అతడు చిన్నబుచ్చుకొని ఏకంగా టెస్ట్ ఫార్మాట్ కు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. ఈ నిర్ణయాన్ని అతడు మే ఏడవ తేదీన వెల్లడించాడు. అది కూడా తన సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు.
Also Read : బుమ్రా కాదు.. టీమిండియా కు టెస్ట్ కెప్టెన్ అతడే..
ఇంతలో ఏం జరిగింది
రోహిత్ శర్మకు, టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కు రెడ్ బాల్ ఫార్మాట్ విషయంలో తీవ్రంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బిసిసిఐ పెద్దలు గతంలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ నుంచి సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కాస్త గడువు కావాలని రోహిత్ అప్పట్లో కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ పై సెలక్షన్ కమిటీ కాస్త మెతక వైఖరి ప్రదర్శించినట్టు సమాచారం. దీంతో టెస్ట్ జట్టుకు కూడా రోహిత్ శర్మనే నాయకత్వం వహిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలోనే సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా సంకేతాలు ఇవ్వడంతో మొత్తం గారు రోహిత్ తన టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. తద్వారా కేవలం వన్డే జట్టుకు మాత్రమే అతడు నాయకుడిగా కొనసాగనున్నాడు. అయితే రోహిత్ తర్వాత టీమిండియా టెస్ట్ చెట్టుకు నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు అనేకమంది ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఈ జాబితాలో టీమిండియా వైస్ కెప్టెన్ గిల్ ముందు వరుసలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.