Rohit Sharma and Virat Kohli: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ..ఈ జోడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే టీమిండియా మీద వీరిద్దరి ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇప్పటికే వీరిద్దరూ టి20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం వన్డే ఫార్మేట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఓ అంచనా ప్రకారం వీరిద్దరు వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో ఉంటారని తెలుస్తోంది.
ఇటీవల వన్డే జట్టు సారధ్య బాధ్యతలనుంచి రోహిత్ శర్మను మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. దీంతో అనేక రకాలుగా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ మేనేజ్మెంట్ తీరు మారలేదు. ఈక్రమంలో రోహిత్ శర్మ మేనేజ్మెంట్ మీద ఏమాత్రం ఆగ్రహం ప్రదర్శించలేదు. పైగా జట్టు కోసం మాత్రమే అతడు ఆడాడు. అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ఆస్ట్రేలియా దేశంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఆ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఆ సిరీస్ లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై విపరీతంగా విమర్శలు వచ్చాయి.
ఇక స్వదేశం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అదరగొట్టారు. విరాట్ కోహ్లీ ఏకంగా రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చూపించాడు.. విరాట్ కోహ్లీ ఏకంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్, విరాట్ బీభత్సంగా పరుగులు చేసిన నేపథ్యంలో వారి ఐసీసీ ర్యాంకింగ్స్ కూడా మారాయి. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో.. వన్డే విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించారు. వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ నెంబర్ వన్, రోహిత్ శర్మ నెంబర్ టు ర్యాంకులు సాధించారు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాల్లో విరాట్, రోహిత్ ఉన్న నేపథ్యంలో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గౌతమ్ గంభీర్ తన ధోరణి మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.
ఇటీవల విరాట్, రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన తర్వాత కూడా గంభీర్ తన ధోరణి మార్చుకోలేదు. పైగా విరాట్ సెంచరీ చేసినప్పటికీ కరచాలనం చేసే సమయంలో.. ముభావంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మీద విమర్శలు వ్యక్తం అయ్యాయి. రోహిత్, విరాట్ జట్టులోకి రావడంతో టీమిండియా వన్డే ట్రోఫీ సాధించింది..