
Rohit Sharma: భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది కెప్టెన్లు వచ్చారు.. పోయారు. కానీ ప్రపంచకప్ లు సాధించిన వారిలో నాడు కపిల్ దేవ్ అయితే.. ఆధునిక క్రికెట్ లో కేవలం మహేంద్ర సింగ్ ధోని మాత్రమే. ధోని సారథ్యంలో టీ20 వరల్డ్ కప్(T20 world cup), ప్రపంచ వన్డే కప్, చాంపియన్స్ ట్రోఫీ మూడు గెలుచుకుంది టీమిండియా. భారత క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన కెప్టెన్ ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ కోహ్లీ(Virat kohli) ఆటగాడిగా ఎంతో సాధించినా భారత్ కు మాత్రం ఒక్క ప్రపంచకప్ ను అందించలేదన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. ఫైనల్ వరకూ రావడం.. ఓడిపోవడం.. కోహ్లీ ఖాతాలో ఒక్క ప్రపంచకప్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు.
ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ మార్పు జరగడం ఖాయమని అంటున్నారు. యూఏఈలో జరుగనున్న టీ20 తర్వాత ఈ మార్పు ఖచ్చితంగా చేయడానికి బీసీసీఐ రెడీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. జులైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ క్రమంలోనే ఈసారి టీ20 ప్రపంచకప్ ను పకడ్బందీగా ఎంపిక చేసిన బీసీసీఐ మెంటర్ గా విజయవంతమైన ఎంఎస్ ధోని(MS DHONI)ని నియమించి అందరికీ షాకిచ్చింది. కోహ్లీ కెప్టెన్సీ సరిపోదని స్పష్టం చేసింది. ఇది కోహ్లీకి ముందస్తు షాక్ గానే చెబుతున్నారు.
ఇక టీ20 ప్రపంచకప్ సాధిస్తే ఓకే. సాధించకపోతే మాత్రం కోహ్లీ కెప్టెన్సీ పోవడం ఖాయమంటున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీని టెస్టులకు పరిమితం చేసి వన్డే, టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించడం ఖాయమని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.
రోహిత్ శర్మ(Rohit Sharma) వన్డేలు, టీ20ల్లో కెప్టెన్ గా తిరుగులేని రికార్డు ఉంది. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో ఐదు సార్లు చాంపియన్ గా నిలిచింది. అతడి కెప్టెన్సీ ప్రతిభకు ఇదే నిదర్శనం. ఇక కోహ్లీ కెప్టెన్సీలో బెంగళూరు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. ఇక ప్రపంచకప్ ఈవెంట్లలోనూ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఓడిపోతూనే ఉంది. బ్యాట్స్ మెన్ గా రాణిస్తూ.. ఆ ఎత్తులు, జిత్తులు వేయడంలో కోహ్లీ విఫలం అవుతున్నాడనే చెప్పాలి. కెప్టెన్ గా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా ఇంగ్లండ్ లో టీమిండియా కెప్టెన్ కోహ్లీతో సమావేశమయ్యారు. టీ20 ప్రపంచకప్ చివరిది అని కోహ్లీకి చెప్పినట్టు సమాచారం. ఇది సక్సెస్ అయితే నో ప్రాబ్లం.. విఫలమైతే మాత్రం టెస్టు కెప్టెన్సీకి పరిమితం కావాలని.. వన్డేలు, టీ20లకు రోహిత్ కెప్టెన్ చేయబోతున్నామని.. ఈ మేరకు పగ్గాలు అప్పగించాలని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో టీమిండియా కాబోయే కెప్టెన్ రోహిత్ శర్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు.