Rohit Sharma: సౌత్ ఆఫ్రికా జట్టుతో టీమ్ ఇండియా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఓడిపోయింది. గుహవాటి వేదికగా ప్రస్తుతం రెండవ టెస్టు ఆడుతోంది. ఈ టెస్టులో టీమిండియా టాస్ ఓడిపోవడంతో.. బౌలింగ్ వేస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్లు.. రెండవ రోజు వికెట్లు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పిచ్ నుంచి ఏమాత్రం సహకారం లభించకపోవడంతో భారత బౌలర్లు తీవ్ర అసహనంతో ఉన్నారు.
రెండవ టెస్ట్ ముగిసిన తర్వాత టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ మొదలవుతుంది. వన్డే సిరీస్ కు సారధిగా గిల్ ను ఇటీవల మేనేజ్మెంట్ ప్రకటించింది. గిల్ ఆధ్వర్యంలో టీమిండియా ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ఆడింది. తొలి రెండు మ్యాచ్లను ఆస్ట్రేలియా గెలవడంతో సిరీస్ కంగారు జట్టు సొంతమైంది. ఈ సిరీస్ ద్వారా రోహిత్ టీమిండియాలోకి ప్రవేశించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు జట్టులోకి ప్రవేశించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అభిమానుల ఉత్సాహానికి తగ్గట్టుగానే రోహిత్ బ్యాటింగ్ చేశాడు. తొలి మ్యాచ్లో అతడు విఫలమైనప్పటికీ.. రెండో మ్యాచ్లో మాత్రం దుమ్మురేపాడు. ఏకంగా హాఫ్ సెంచరీ చేశాడు. మూడో మ్యాచ్లో సెంచరీ సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియా అంటే తన ఫామ్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపించాడు.
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సారధి గిల్ గాయపడ్డాడు. అప్పట్లో అతడు కోలుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. అందువల్లే రెండో టెస్టుకు పంత్ ను సారధిగా నియమించింది మేనేజ్మెంట్.. ఈ క్రమంలో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. గిల్ గాయపడిన నేపథ్యంలో వన్డే సిరీస్ కు సారథి ఎవరు అని ప్రశ్న వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఉపసారథి అయ్యర్ కూడా ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్లో గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్లు జట్టులో లేకపోవడంతో సారధి ఎవరనే చర్చ మొదలైంది. అయితే రోహిత్ ను సారధిగా నియమిస్తే ఎలా ఉంటుంది? అనే అంశం జట్టు మేనేజ్మెంట్ వర్గాల్లో వ్యక్తం అయినట్టు తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనను రోహిత్ తిరస్కరిస్తాడని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. గిల్, అయ్యర్ గాయపడిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటన రానుంది.