Rohit Sharma: టీమిండియా ఇటీవల టి20 వరల్డ్ కప్ గెలిచింది. 2007 తర్వాత దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై అద్భుతమైన విజయం సాధించి.. టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యంగా ప్లేయింగ్ -15 జాబితాలో ఉన్న ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ఐదు కోట్ల చొప్పున ఆ ప్రైజ్ మనీ పంచాలని అప్పట్లో భావించారు. అయితే దీనిని రోహిత్ శర్మ తిరస్కరించాడు. అందరికీ ప్రైజ్ మనీ ఒకే విధంగా రావాలని.. అవసరమైతే తన ప్రైజ్ మనీలో కోత విధించాలని బీసీసీఐకి సూచించాడు. అతడు చెప్పినట్టుగానే బీసీసీఐ చేసింది. ఫలితంగా కిందిస్థాయి సిబ్బందికి మెరుగైన ప్రైజ్ మనీ దక్కింది. అప్పట్లో రోహిత్ శర్మ తీసుకున్న ఆ నిర్ణయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొద్ది రోజులపాటు దీని చుట్టే చర్చ నడిచింది. అయితే అలాంటి రోహిత్ మరోసారి అటు సోషల్ మీడియా, ఇటు మీడియాలో చర్చనీయాంశమైన వ్యక్తిగా మారిపోయాడు.
బుధవారం CEAT వార్షిక క్రికెట్ పురస్కారాల ప్రధానోత్సవ వేడుక జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మకు ఈ ఏడాది మేటి అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రోహిత్ విలేకరులతో మాట్లాడాడు. ” టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ గెలవడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. ఈ ప్రయాణంలో మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రటరీ జై షా నాకు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారు.. జట్టులో మార్పు తీసుకొచ్చేందుకు వారి వంతు కు మించి నాకు అవకాశం కల్పించారు. ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని సృష్టించారు.. ఇలాంటి వాతావరణం వల్లే టీమిండియా విజేతగా ఆవిర్భవించింది. ఇందులో నా ఒక్కడి పాత్ర లేదు. అందరూ సమష్టిగా ప్రదర్శన చేయడం వల్లే ఇదంతా సాధ్యమైందని” రోహిత్ వ్యాఖ్యానించాడు.
రోహిత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో అతనిపై అభినందనల జల్లు కురుస్తోంది. ఇలాంటి గుణం ఉండడం వల్లే టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి కెప్టెన్ దొరకడం టీమిండియా చేసుకున్న పుణ్యమని కితాబిస్తున్నారు. రోహిత్ శర్మ ఇంకా మరింతకాలం క్రికెట్ ఆడాలని.. భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాలని.. 2011 తర్వాత భారత జట్టు మరోసారి వన్డే వరల్డ్ కప్ సాధించలేదని.. ఆ కలను రోహిత్ శర్మ నెరవేర్చాలని.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ టీమిండియా కు గదను అందించాలని అభిమానులు కోరుతున్నారు.