Rohit Sharma opens up: పొమ్మనలేక పొగ పెట్టే సామెత ఎప్పుడైనా చదివారా.. పోనీ మీకు నిజ జీవితంలో ఎప్పుడైనా ఎదురైందా.. మీ సంగతేమో గాని ఇప్పుడు టీమిండియా వన్డే సారథి రోహిత్ శర్మకు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ నిర్ణయం ఇప్పుడు రోహిత్ శర్మ భవితవ్యాన్ని నిర్దేశించినుంది కాబట్టి.. దీంతో రోహిత్ అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయింది.
2027 లో జరిగే పరిమిత ఓవర్ల ప్రపంచ కప్ ను ఎలాగైనా గెలవాలని భారత్ భావిస్తోంది. 2023 వెంట్రుక వాసిలో విశ్వకప్ ను భారత్ కోల్పోయింది. ఈసారి అలాంటి తప్పుకు ఆస్కారం ఇవ్వకుండా చూడాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. పైగా 2027లో సౌత్ ఆఫ్రికా వేదికగా విశ్వ సమరం జరుగుతుంది. ఆ సమరంలో ఎలాగైనా సరే గెలవాలని భారత మేనేజ్మెంట్ కృత నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే రకరకాల ప్రణాళికలను ఇప్పటి నుంచే మొదలుపెట్టింది. ఇటీవల పరిమిత ఓవర్లలో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ని భారత్ గెలిచినప్పటికీ.. వరల్డ్ కప్ కు ఉన్న ప్రాధాన్యం వేరే కాబట్టి.. దానిమీద దృష్టిని కేంద్రీకరించింది భారత క్రికెట్ మేనేజ్మెంట్.
తెరపైకి సరికొత్త టెస్ట్
2027లో వన్డే వరల్డ్ కప్ గెలవాలని లక్ష్యంతో ఉన్న టీమ్ ఇండియా మేనేజ్మెంట్ తెరపైకి బ్రాంకో టెస్టును తీసుకువచ్చింది. ఈ టెస్ట్ లో భాగంగా ఆటగాళ్లు 6 నిమిషాల్లోనే 1200 మీటర్లు పరుగు పెట్టాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు. ప్రారంభంలో ఎంత వేగంతో అయితే పరుగును మొదలుపెట్టారో.. చివరి వరకు అదే జోరు కొనసాగించాలి.. గతంలో 2011 వరల్డ్ కప్ తర్వాత యోయో అనే టెస్ట్ ను తెరపైకి తీసుకొచ్చారు. అందులో యువరాజ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ ను పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా బ్రాంకో టెస్టును తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో ఆటగాడు ఆరు నిమిషాల్లోనే 1200 మీటర్ల దూరం పరుగు పెట్టాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీకి ఇది సాధ్యమవుతుంది గాని.. రోహిత్ శర్మకు మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ తో పోల్చి చూస్తే రోహిత్ శర్మకు శరీర సామర్థ్యం అంతగా ఉండదు. పైగా అతడు కాస్త లావుగా ఉంటాడు. అతడిని పొమ్మనలేక పొగ పెడుతున్నారని సీనియర్ క్రికెటర్ మనోజ్ తివారి ఆరోపిస్తున్నాడు.. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలిచిందంటే దానికి కారణం రోహిత్ శర్మ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అతడు సూచిస్తున్నాడు.. ఈ టెస్ట్ పై మాజీ ప్లేయర్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.