Rohit Sharma: విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ పై సంచలన కామెంట్స్ చేసిన రోహిత్ శర్మ

బౌలింగ్ లో అద్భుతాలు చేసిన అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ పై రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు.." చాలా గర్వంగా ఉంది. అంతకుమించి ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఆత్మసంతృప్తి కలిగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 28, 2024 12:12 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma: దశాబ్దం పాటు నిరీక్షించిన తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ లోకి ప్రవేశించింది. 2014లో తుది పోరుకు భారత జట్టు అర్హత సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండవ సెమీస్ మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా, రోహిత్ శర్మ దూకుడుగా ఆడటంతో మెరుగైన స్కోర్ చేసింది.. పలుమార్లు వర్షం ఆటంకం కలిగించినప్పటికీ రోహిత్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 171 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు టీమిండియా బౌలర్లు ప్రారంభం నుంచి శ్రమించారు. ఇంగ్లాండ్ జట్టును ఎక్కడికక్కడ కట్టడి చేశారు. అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ తలా మూడు వికెట్లు దక్కించుకున్నారు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. గత టి20 వరల్డ్ కప్ లో సెమీస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ దారుణమైన పరాభవాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో గురువారం గయానా వేదిక జరిగిన మ్యాచ్ లో గెలుపొందడం ద్వారా దెబ్బకు దెబ్బ కొట్టింది . మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు.

బౌలింగ్ లో అద్భుతాలు చేసిన అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ పై రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు..” చాలా గర్వంగా ఉంది. అంతకుమించి ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఆత్మసంతృప్తి కలిగింది. ఈ విజయం కోసం మేము చాలా కష్టపడ్డాం. సమష్టి ఆట తీరును ప్రదర్శించాం. పరిస్థితులను త్వరగా అలవాటు చేసుకున్నాం. ఈ విజయం మాకు చాలా రోజుల వరకు గుర్తుండిపోతుంది. బ్యాటర్లు, బౌలర్లు పకడ్బందీగా ఆడితే గెలవడం చాలా సులభం అని నిరూపించాం. ఒకానొక దశలో మేము 150 పరుగులకే పరిమితం కావలసి వస్తుందని అనుకున్నా. విరాట్, రిషబ్ అవుట్ అయిన తర్వాత.. నేను, సూర్య దూకుడు పెంచాం. కనీసం 170 పరుగులు చేస్తే సరిపోతుందనిపించింది. కానీ లోయర్ ఆర్డర్ లోనూ జట్టుకు అవసరమైన పరుగులు సాధించాం. బౌలింగ్ లో అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ అద్భుతాలు సృష్టించారు. ఇలాంటి మైదానంపై అలాంటి బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. తీవ్రమైన ఒత్తిడిలోనూ వారు మెరుగ్గా బౌలింగ్ చేయగలరు. వికెట్లను నేల కూల్చగలరు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. స్టంప్స్ లక్ష్యంగా బంతులు వేయడం పైనే దృష్టి కేంద్రీకరించామని కులదీప్, అక్షర్ నాతో చెప్పారు. వారు అలా బౌలింగ్ చేయడం వల్లే మేము మ్యాచ్ ను శాసించగలిగే స్థాయికి వచ్చేశామని” రోహిత్ పేర్కొన్నాడు.

బౌలర్ల గురించి ప్రస్తావన ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ గురించి రోహిత్ మాట్లాడాడు. “చాలామంది విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడుతున్నారు. అది పెద్ద విషయం కాదు. సమస్య అంతకన్నా కాదు. విరాట్ క్లాసిక్ ప్లేయర్. గత 15 సంవత్సరాలుగా అతనితో కలిసి నేను క్రికెట్ ఆడుతున్నాను. అతని ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ ఉంటాడు. కోహ్లీని పక్కన పెడతారనడంలో అర్థం లేదు. చివరి పోరులో అతడు తప్పకుండా ఉంటాడు. బలమైన ఇన్నింగ్స్ ఆడతాడు. నాకు కోహ్లీపై నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేడు. టీమిండియా కు అతడు అద్భుతమైన విజయాలు అందించాడు. అలాంటి వ్యక్తిని రెండు మూడు మ్యాచ్ల్లో ఆడకపోయినంత మాత్రాన తక్కువ చేసి మాట్లాడటం సరికాదని” రోహిత్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఈ మ్యాచ్లో కోహ్లీ 9 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు.