Rohit Sharma comeback: భీమ్లా నాయక్ సినిమా చూశారా.. అందులో దగ్గుబాటి రానా ను ఉద్దేశించి “అతడు ఒక ఉద్యమకారుడు. అతని వల్ల విప్లవం వస్తుందని భావించి పోలీస్ చొక్కా వేశాం. నువ్వు అతడి చొక్కాను విప్పించావు. వైల్డ్ అనిమల్ లాగా రెచ్చిపోతున్నాడు. అతడిని ఆపడం దాదాపు అసాధ్యమని” మురళి శర్మ ఓ డైలాగ్ అంటాడు గుర్తుందా.. ఇప్పుడు ఈ డైలాగు ఎందుకు చెప్పాం.. ఎందుకింత ఎలివేషన్ ఇచ్చామంటే.. ఒకసారి ఈ కథనం చదవండి.. మీకు రోమాలు నిక్కపొనడవకపోతే అడగండి.
టీమిండియా వన్డే కెప్టెన్ గా గిల్ నియమితుడయ్యాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో అతడు నాయకుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. మొత్తానికి ఇన్నాళ్లుగా సారధిగా ఉన్న రోహిత్ శర్మ మామూలు ఆటగాడు అయిపోయాడు. సాధారణ ప్లేయర్ అయ్యాడు కాబట్టి రోహిత్ ఆటతీరులో మార్పు వస్తుందా.. అతడు మునుపటిలాగా ఆడతాడా.. ఇవే అనుమానాలు ఇప్పుడు సగటు అభిమానిలో కలుగుతున్నాయి. రోహిత్ సారధిగా అయ్యే కంటే ముందు.. ఆటగాడిగానే అదరగొట్టాడు. పరిమిత ఓవర్ల మ్యాచ్లో అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. ఏకంగా మూడు డబుల్ సెంచరీలు చేశాడు. కెప్టెన్ అయిన తర్వాత అతడు ఆస్ట్రేలియా మీద ద్వి శతకాన్ని సాధించాడు. ఒకవేళ అతడు నాన్ కెప్టెన్ రోజులు కనుక గుర్తుకు తీసుకుంటే తిరుగుండదు. ఇక ప్రస్తుతం రోహిత్ 10 కిలోల బరువు తగ్గి అత్యంత నాజూకుగా కనిపిస్తున్నాడు. వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాడు..
శరీర సామర్ధ్యంలో.. బ్యాటింగ్ సామర్ధ్యంలో రోహిత్ పై ఒక అంచనాకు రావడం కష్టం. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ పక్కన పెడితే.. పరిమిత ఓవర్లలో రోహిత్ అద్భుతంగా ఆడతాడు. ఉన్నంతసేపు అద్భుతాలు సృష్టించి వెళ్తాడు. బౌలర్ ఎవరనేది పట్టించుకోడు. దూకుడుగా ఆడటం మాత్రమే అతనికి తెలుసు. 2023 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ 11 మ్యాచ్ లు ఆడాడు.. ఏకంగా 597 పరుగులు చేశాడు. దీనిని బట్టి రోహిత్ కెప్టెన్సీ భారం ఉన్నప్పటికీ కూడా అతని ఆట తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
సారధిగా రోహిత్ 2017 నుంచి 2025 వరకు వన్డేలలో అద్భుతాలు సృష్టించాడు. ఇతడి నాయకత్వంలో టీమిండియా 56 వన్డేలు ఆడింది. 42 మ్యాచులలో విజయం సాధించింది. ఈ ప్రకారం సారధిగా రోహిత్ విజయాల శాతం 76. టీమిండియా కెప్టెన్ లు గా అద్భుతాలు సృష్టించిన గంగూలీ 51.70, ధోని 55 విజయాల శాతాలు సాధించారు. కపిల్ దేవ్ 52.70, అజహార్ 51.72, రాహుల్ ద్రావిడ్ 53.16, విరాట్ కోహ్లీ 68.42 శాతం విజయాలను టీం ఇండియాకు అందించారు. వీరందరి కంటే కూడా రోహిత్ శర్మ సాధించిన విజయాల శాతమే ఎక్కువ కావడం విశేషం. ఆస్ట్రేలియా మైదానాలపై రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే రోహిత్ శర్మ ఇప్పుడు సాధారణ ఆటగాడు.. అతనిపై పెద్దగా ఒత్తిడి లేదు. అలాంటప్పుడు రోహిత్ శర్మను నిలువరించడం ఒకరకంగా ఆస్ట్రేలియాకు కత్తి మీద సామూలాంటిదే.