Rohit Sharma: ఒక ఏడాదిలో ఇన్ని విజయాలా? రోహిత్ అన్నా.. నీ నాయకత్వం అదుర్స్..

వాస్తవానికి ఒక జట్టు ఒక సంవత్సరం కాలంలో.. ఐసీసీ నిర్వహించిన మూడు మేజర్ కప్ లలో ఫైనల్ వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. బహుశా ఈ రికార్డు మరే జట్టుకు సాధ్యం కాకపోవచ్చు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 29, 2024 5:56 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma: వన్డే వరల్డ్ కప్ లో అప్రతిహత విజయాలు సాధించింది. ఫైనల్ దాకా దూసుకెళ్లింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు మినహా.. మిగతా అన్ని మ్యాచ్లలో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. లీగ్ దశలో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించింది. దక్షిణాఫ్రికాను బెంబేలెత్తించింది. పాకిస్తాన్ ను పడుకోబెట్టింది. న్యూజిలాండ్ ను వణికించింది. అద్భుతమైన విజయాలు సాధించి ఏకంగా ఫైనల్ దాకా దూసుకెళ్లింది. భారత్ సాధించిన ఈ వరుస విజయాల వెనక కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ దక్కకపోయినప్పటికీ.. కొద్ది రోజులకే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి భారత్ దూసుకెళ్లింది. ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి పోటీ ఎదురయింది. చివరికి టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు టి20 వరల్డ్ కప్.. వరుస విజయాలతో భారత్ ఫైనల్ దూసుకెళ్లింది. కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది.

వాస్తవానికి ఒక జట్టు ఒక సంవత్సరం కాలంలో.. ఐసీసీ నిర్వహించిన మూడు మేజర్ కప్ లలో ఫైనల్ వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. బహుశా ఈ రికార్డు మరే జట్టుకు సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి రికార్డును టీమిండియా పాదాక్రాంతం చేసిన ఘనత రోహిత్ శర్మకు దక్కుతుంది. ఐపీఎల్ లో తన సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు. అంతేకాదు తన నాయకత్వంలో టీం ఇండియన్ కూడా అదే స్థాయిలో నడిపిస్తున్నాడు. ఏడాది వ్యవధిలో మూడు ఐసీసీ టోర్నీలలో టీమిండియాను ఫైనల్ దాకా చేర్చాడు. విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. తన మార్క్ నిర్ణయాలతో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ టైటిళ్లను భారత జట్టు త్రుటిలో చేజార్చుకున్నప్పటికీ.. ఆ బాధను దిగ మింగుకొని.. టి20 వరల్డ్ కప్ లో టీమిండియాను ఫైనల్ దాకా చేర్చాడు రోహిత్ శర్మ.

ఆటగాళ్ల ఎంపికలో..

ఆటగాళ్ల ఎంపికలో రోహిత్ శర్మ చాలా భిన్నంగా వ్యవహరిస్తాడు. ప్రతి విషయంలోనూ తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ కోసం నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేశాడు. వాస్తవానికి ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.. పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండే వెస్టిండీస్ లో నలుగురు స్పిన్నర్లు ఎందుకు అని సీనియర్ క్రికెటర్లు ప్రశ్నించారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ ఎంపికను చాలామంది తప్పు పట్టారు. ఆ విషయంలో రోహిత్ మౌనాన్ని మాత్రమే ఆశ్రయించాడు. టోర్నీ మొదలైన తర్వాత అక్షర విలువ ఏంటో తెలుస్తుందని రోహిత్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. రోహిత్ చెప్పినట్టుగానే అక్షర్ పటేల్ ఏడు మ్యాచ్లలో ఎనిమిది వికెట్లు నేలకూల్చాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును కకావికలం చేశాడు.. మూడు వికెట్లను పడగొట్టడంతో పాటు, ఒక రనౌట్ కూడా చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ తన సత్తా చూపించాడు.

కెప్టెన్ గానే కాకుండా అటాకింగ్ ఆట తీరుకు రోహిత్ శర్మ పెట్టింది పేరు. విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచడంలో దిట్ట. ఇప్పటికే పలుమార్లు తన ఆటతీరుతో అనేక జట్ల బౌలర్లకు సింహ స్వప్నం లాగా మిగిలాడు. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లోనూ అదే స్థాయిలో ఆటను ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా సూపర్ -8 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఏకంగా 92 పరుగులు చేసి తన సత్తాను మరోసారి చాటాడు. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై అర్థ సెంచరీ సాధించి తన బ్యాటింగ్ స్టైల్ వేరే లెవెల్ అని నిరూపించాడు. తన బ్యాటింగ్ ద్వారా మిగతా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతూ.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేలా చేస్తున్నాడు.

ఇక ఈ టోర్నీలో రోహిత్ బౌలర్లను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు తగ్గట్టుగా ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడు. మైదానంలో ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకొని.. అప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తున్నాడు. కొత్త ప్రణాళికలను అమలులో పెడుతున్నాడు. ఇదే జోరు కనుక రోహిత్ శర్మ మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్లో కొనసాగిస్తే టీమిండియా కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని అభిమానులు చెబుతున్నారు.