Rohit Sharma: ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు ట్రోఫీలు దక్కించుకున్న చరిత్ర ఈ జట్టుకుంది. ప్రపంచంలో మేటి ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. అయినప్పటికీ గత రెండు సీజన్లలో ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ఈ ఏడాదైనా కప్ దక్కించుకోవాలని ఆ జట్టు అభిమానులు కోరుకున్నారు. అభిమానుల కోరిక ఒక రకంగా ఉంటే.. జట్టు యాజమాన్యం తీరు మరో విధంగా ఉంది. 17వ సీజన్ ప్రారంభంలోనే అభిమానులకు జట్టు యాజమాన్యం కోలుకోలేని షాకిచ్చింది. ఐపీఎల్ లో ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఇక అప్పటినుంచి ముంబై జట్టును కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి..
ఈ సీజన్లో ముంబై జట్టు తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో ఆడింది. ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో దారుణంగా పరుగులు ఇచ్చింది. ముంబై పసలేని బౌలింగ్ కారణంగా హైదరాబాద్ జట్టు ఐపిఎల్ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగులు నమోదు చేసింది. అనంతరం ముంబై జట్టు బ్యాటింగ్ చేసి 246 పరుగులు చేయగలిగింది. 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై జట్టు కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది.. ఆ జట్టు చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది.. వాస్తవానికి రాజస్థాన్, హైదరాబాద్, గుజరాత్ జట్లు ముంబై తో పోల్చినప్పుడు అంత బలమైనవి కాదు. కానీ ముంబై జట్టు తన బలాన్ని సరైన సమయంలో వినియోగించుకోలేకపోతోంది. ఫలితంగా ఐపీఎల్ లో వరుస ఓటములు ఎదుర్కొంటోంది. ముంబై జట్టు ఇలా వరుసగా ఓటములు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జట్టులో వర్గాలు ఏర్పడ్డాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాత కెప్టెన్ రోహిత్ శర్మ అంత ఆసక్తిగా లేడని తెలుస్తోంది. యాజమాన్యానికి చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేకపోవడంతో అతడు ఈ సీజన్ లో ముంబై జట్టుకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.”జట్టు యాజమాన్యం తీరుపై రోహిత్ శర్మ ఆగ్రహం గా ఉన్నాడు. వారు వ్యవహరిస్తున్న తీరుతో నిరాశతో ఉన్నాడు. అతడు ఈ సీజన్ లో మాత్రమే ముంబైజటకు ఆడతాడు.. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలానికి వెళ్తాడని” వార్త కథనాలు వినిపిస్తున్నాయి.. ఇదే విషయాన్ని ముంబై జట్టు ఆటగాడు చెప్పాడని.. కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అయితే వీటిపై ఇంతవరకు రోహిత్ శర్మ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ముంబై యాజమాన్యం కూడా స్పందించలేదు. అంటే రోహిత్ శర్మ ముంబై జట్టును విడిపోవడం ఖాయమని.. క్రీడా విశ్లేషకులు అంటున్నారు.