Rohit Sharma: రోహిత్ శర్మ.. అభినవ ఇండియన్ హిట్ మ్యాన్. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు కొడతాడు. షర్టు వేసుకున్నంత సులభంగా ఫోర్లు బాదుతాడు. యంగ్ టాలెంట్ ని ఆహ్వానిస్తాడు. సీనియర్లకు రెస్పెక్ట్ ఇస్తాడు. పొరపాటున కూడా ఒకరి వ్యక్తిగత జీవితాల్లో వేలు పెట్టడు. జెంటిల్మెన్ గేమ్ లాంటి క్రికెట్లో అతడు జెంటిల్మెన్. తనదైన రోజు ఎలాగైనా ఆడతాడు. ఎంతసేపైనా ఆడతాడు. జట్టు కోసం అవసరమైతే ఎలాంటి పాత్ర పోషించడానికయినా సిద్ధమవుతాడు. అలాంటి ఆటగాడు టీమిండియా కు ఎన్నో విజయాలు అందించాడు. వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ వంటివి అందించకపోయినా జట్టు ఆ మెగా టోర్నీలలో సత్తా చాటేలా కృషి చేశాడు. ఐపీఎల్ లాంటి ఫార్మాట్లో ముంబై జట్టుకు ఏకంగా ఐదుసార్లు కప్ లు అందించాడు. అలాంటి ఆటగాడు ప్రస్తుతం కెప్టెన్సీ ని కోల్పోయాడు. ఒక సాధారణ ఆటగాడిగా మిగిలిపోయాడు.
ఆదివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అడుగడుగునా హార్దిక్ పాండ్యా చేతిలో అవమానాలు ఎదుర్కొన్నాడు. స్లిప్ లేదా మిడిల్ పిచ్ లో ఫీల్డింగ్ చేసే అతడు బౌండరీ లైన్ వద్దకు వెళ్లాడు. ఆ బౌండరీ లైన్ వద్ద కూడా పలుసార్లు స్థాన చలనానికి గురయ్యాడు. ఈ దృశ్యాలు చూస్తున్న ప్రేక్షకులకు కడుపు మండిపోయింది. పిల్ల బచ్చాగాడు రోహిత్ శర్మను పెడుతున్న ఇబ్బంది చూసి ఒళ్ళు తరుక్కుపోయింది. అందుకే వారి ఆగ్రహాన్ని ప్రదర్శించారు. హార్దిక్ పాండ్యా కు వ్యతిరేకంగా ప్లకార్డులను చేత పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. మనదేశంలో.. అది కూడా మన దేశానికి చెందిన ఒక క్రికెటర్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం కావడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. అయినప్పటికీ హార్థిక్ పాండ్యా తన బుద్ధి మార్చుకోలేదు. రోహిత్ శర్మ పై పైశాచికత్వాన్ని ప్రదర్శించకుండా మానుకోలేదు. దీంతో రోహిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అటు ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యాన్ని.. ఇటు హార్దిక్ పాండ్యాను ఏకిపారేయడం మొదలుపెట్టారు. అయితే ఆగ్రహంగా ఉన్న తన అభిమానులను రోహిత్ శర్మ చల్లబరిచే ప్రయత్నం చేశాడు.
ఆదివారం నాటి మ్యాచ్లో గుజరాత్ జట్టు చేతిలో ఓటమి ఎదురు కావడంతో రోహిత్ శర్మ కొంతమేర ఇబ్బంది పడ్డాడు. ఆ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కానీ సోమవారం నాడు దానిని పక్కన పెట్టాడు. హోలీ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆడి పాడాడు. తన భార్య, పిల్లలపై రంగులు చల్లి సందడి చేశాడు. రోహిత్ పిల్లలు కూడా ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన రోహిత్ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.”పిల్ల బచ్చా గాడు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు. కానీ నువ్వు భోళా శంకరుడివి రోహిత్ భయ్యా.. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉత్సాహంగా ఉండాలి. అద్భుతమైన క్రికెట్ ఆడాలి. మమ్మల్ని ఆనందింప చేయాలంటూ” కామెంట్లు చేస్తున్నారు.
Rohit Sharma celebrating Holi. [Rohit/Instagram] pic.twitter.com/6U0QdWACNl
— Johns. (@CricCrazyJohns) March 25, 2024