Reason behind Dravid leaving RR: వచ్చే ఐపీఎల్ సీజన్ ఇంకా మొదలుకాకముందే సెన్సేషనల్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వచ్చే సీజన్ కు సంబంధించి మినీ వేలం జరగడానికి ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ.. అభిమానుల బుర్రలు బద్దలైపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది.. వాస్తవానికి ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ద్రావిడ్ బయటికి వచ్చేసారు..
2024 లో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కోచ్ పదవి కాలం ముగిసిపోవడంతో ద్రావిడ్ తప్పుకున్నాడు. రోహిత్ శర్మ విజ్ఞప్తి చేసినప్పటికీ.. మిగతా ఆటగాళ్లు కోరినప్పటికీ ద్రావిడ్ కోచ్ గా కొనసాగడానికి ఇష్టపడలేదు. నేరుగా తను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శిక్షకుడిగా ఉండాలని అనుకుంటున్నట్టు.. తను కష్ట కాలంలో ఉన్నప్పుడు రాజస్థాన్ జట్టు యాజమాన్యం ఆదుకుందని.. అందువల్లే ఉడుతా భక్తిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్టుగానే అతడు రాజస్థాన్ జట్టు కు శిక్షకుడిగా వ్యవహరించారు. ద్రావిడ్ శిక్షణలో రాజస్థాన్ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సీజన్లో 14 మ్యాచులు ఆడి.. కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది.. అయితే రాజస్థాన్ యాజమాన్యం గ్రేట్ వాల్ కు అదనపు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించింది. దానికి ఆయన ఒప్పుకోలేదు. దీంతో జట్టు నుంచి బయటకు వచ్చాడు. ఇదే విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగిసిందని.. ఆయన ఒక రాయల్ అని.. ఆయన సేవలకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది . రాహుల్ ద్రావిడ్ చాలా సంవత్సరాలుగా మా జట్టు ప్రయాణంలో కీలకంగా ఉన్నారని.. ఆయన నాయకత్వం ఎంతో మందిని ప్రభావితం చేసిందని.. ఆయన బలమైన విలువలను నెలకొల్పారని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది.
తదుపరి ద్రావిడ్ ఏం చేస్తారు
రాజస్థాన్ రాయల్స్ నుంచి తప్పుకున్న తర్వాత రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్ ద్రావిడ్ తర్వాత ఆ స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారనేది తెలియాల్సి ఉంది. రాజస్థాన్ జట్టులో అంతర్గత కలహాలు పెరిగిపోవడం వల్లే ద్రావిడ్ బయటికి వచ్చారని వాదన కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు రాహుల్ ద్రావిడ్ కాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ రాజస్థాన్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించారు. అయితే ఆయన ఎంత కష్టపడినప్పటికీ జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తి లోపించడంతో.. చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది రాజస్థాన్ జట్టు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కాకముందే రెండు యాజమాన్యాలు తమ శిక్షకులను తొలగించాయి. ఇందులో కోల్ కతా నైట్ రైడర్స్ మొదటి స్థానంలో ఉంది. అజట్టి యాజమాన్యం చంద్రకాంత్ పండిట్ ను ఆ స్థానం నుంచి తొలగించింది. 2023 లో అతడు జట్టులో చేరాడు. 2024లో ఆ జట్టు టైటిల్ అందుకుంది. 2025లో దారుణంగా విఫలమైంది. దీంతో మేనేజ్మెంట్ అతడిని తొలగించింది.