Hyderabad: హైదరాబాదులోని సరూర్ నగర్ కోదండరాం నగర్ -7 లో భర్తను ప్రియుడి సహకారంతో భార్య చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులకు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలను పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Also Read: రాజస్థాన్ రాయల్స్ నుంచి ద్రావిడ్ ఎందుకు తప్పుకున్నారు? కారణం అదేనా?
కోదండరాం నగర్ లో చిట్టి, ఆమె భర్త శేఖర్ నివాసం ఉంటున్నారు. వీరికి 2009లో వివాహం జరిగింది. వీరిద్దరికి కుమారుడు, కుమార్తె సంతానం. కూతురు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నది. కుమారుడు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్నాడు. శేఖర్, చిట్టి వివాహం జరిగిన నాటి నుంచి అన్యోన్యంగానే ఉంటున్నారు. అయితే ఇటీవల హరీష్ తో చిట్టికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనిపై చిట్టిని శేఖర్ మందలించాడు. ఇది మనసులో పెట్టుకున్న చిట్టి అతడి అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇదే విషయాన్ని ప్రియుడు హరీష్ తో చెప్పింది. ఈ క్రమంలోనే రాత్రి భోజనం చేసి పడుకున్న శేఖర్ పై ప్రియుడు హరీష్ సహకారంతో దిండు పెట్టింది. ఊపిరి ఆడకుండా చేసింది. అయితే శేఖర్ వారించడంతో హరీష్ పక్కకు పడ్డాడు. పక్కనే ఉన్న డంబెల్స్ సహాయంతో భర్తను తలపై గట్టిగా కొట్టి చంపేసింది చిట్టి.
కుమారుడిని వినాయక మండపం వద్దకు పంపించింది
భర్తను చంపుతున్నప్పుడు కుమారుడు చూడకూడదని.. అతడిని ఆ రాత్రి వినాయకుడి మండపం దగ్గర పడుకోమని చెప్పింది చిట్టి. ఉదయం పోలీసులకు ఫోన్ చేసి తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి పడుకున్నాడని.. ఉదయం లేచి చూడగా చనిపోయాడని చెప్పింది. ఆమె తీరు పట్ల పోలీసులకు అనుమానం రావడంతో విచారించారు. తన ప్రియుడు హరీష్ తో కలిసి శేఖర్ ను చంపినట్టు ఒప్పుకుంది చిట్టి. శేఖర్, చిట్టి స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాదారం. 2009లో వీరిద్దరికి వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం వారిద్దరు హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వివాహేతర సంబంధం చివరికి వీరి జీవితాలను ఇలా తలకిందులు చేసింది.