WPL 2026 RCB Vs UPW: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (women’s premier league – 2026) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bengaluru) దూసుకుపోతోంది. ఈ టోర్నీలో రెండవ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ వారియర్స్ (UP warriors) తో సోమవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్లో ఫస్ట్ బౌలింగ్లో బెంగళూరు జట్టు దుమ్ము రేపింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఆ తర్వాత బెంగళూరు ఓపెనర్లు గ్రేస్ హ్యారిస్ (Grace Harris), స్మృతి మందాన (Smriti mandhana) అదరగొట్టారు. తద్వారా 47 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు జట్టుకు విజయాన్ని అందించారు.
మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (Deepti Sharma) (45*), డియా డాటిన్ (Diya Dottin)(40*) పర్వాలేదు అనిపించారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్(Shreyanka Patil) (2/50), నదైన్ డీ క్లర్క్ (Nadhain D clerk)(2/28) చెరి 2 వికెట్లు పడగొట్టారు. లారెన్ బెల్ (Lauren Bell) ఒక వికెట్ సొంతం చేసుకుంది.
145 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన బెంగళూరు జట్టు సులువుగా విజయాన్ని దక్కించుకుంది. కేవలం 12.1 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. ఓపెనర్లు గ్రేస్ (85), స్మృతి (47*) సత్తా చూపించారు. వీరిద్దరూ విధ్వంసాన్ని సృష్టించడంతో యూపీ బౌలర్లు తేలిపోయారు. శిఖ పాండే మాత్రమే ఒక వికెట్ తీయగలిగింది.
టార్గెట్ ఫినిష్ చేయడంలో రంగంలోకి దిగిన బెంగళూరు జట్టు పవర్ ప్లే వరకే 78 పరుగులు చేసింది. అప్పటికి ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. గ్రేస్ శిఖా పాండేకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది. తొలి వికెట్ కు గ్రేస్, స్మృతి 137 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. గ్రేస్ ఔట్ అయిన తర్వాత రీచా ఘోష్(Richa Ghosh) క్రీజులోకి వచ్చింది. ఫోర్ కొట్టి సత్తా చాటింది. అనంతరం బై రూపంలో బౌండరీ రావడంతో స్మృతి విజయ లాంచనాన్ని పూర్తి చేసింది. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో జరిగిన తొలి మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది. ఇప్పుడు యూపీ జట్టుతో జరిగిన మ్యాచ్లో మరో విజయాన్ని అందుకుంది.
ఈ టోర్నీలో గ్రేస్, స్మృతి బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. ఏ మాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలర్లు ఎవరనేది పట్టించుకోకుండా దుమ్ము లేపుతున్నారు. వీరిద్దరి దూకుడు చూస్తుంటే ఈసారి కూడా బెంగళూరు జట్టుకు ట్రోఫీ అందించేలాగా ఉన్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. స్మృతి బెంగళూరుకు ట్రోఫీ అందించిన నేపథ్యంలో.. 2025 ఐపీఎల్ సీజన్లో పురుషుల జట్టు కూడా తొలిసారి కప్ అందుకుంది. ఈసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టు మరోసారి విజేతగా నిలిస్తే.. పురుషుల ఫార్మేట్ లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.