RCB Vs CSK IPL 2024: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆర్సీబీ.. ఏమా పోరాటం.. సెల్యూట్ చేయాల్సిందే

218 పరుగుల టార్గెట్ చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. మాక్స్ వెల్ వేసిన తొలి బంతికి రుతురాజ్ గైక్వాడ్ గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్ నాలుగు పరుగులకే యష్ దయాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 19, 2024 8:48 am

RCB Vs CSK IPL 2024

Follow us on

RCB Vs CSK IPL 2024: మ్యాచ్ అంటే అది. పోరాటం అంటే అది. గెలవాలి.. కచ్చితంగా నిలవాలి.. కప్ కొట్టాలి.. ఆ కసి అందరి ఆటగాళ్లలో కనిపించింది.. అందువల్లే బెంగళూరు వరుసగా ఆరవ విజయాన్ని సాధించి.. దర్జాగా ప్లే ఆఫ్ వెళ్ళింది.. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సంచలన విజయాన్ని నమోదు చేసి, ఔరా అనిపించింది. చెన్నై జట్టుతో చిన్న స్వామి స్టేడియం వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో బెంగళూరు అన్ని విభాగాలలో అదరగొట్టింది. చెన్నై జట్టును 27 పరుగుల తేడాతో ఓడించింది.

ఈ అద్భుతమైన విజయం ద్వారా మెరుగైన రన్ రేట్ సాధించి, ప్లే ఆఫ్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. మరోవైపు మెరుగైన రన్ రేట్ లేకపోవడంతో చెన్నై ఈ టోర్నీ నుంచి ఎగ్జిట్ అయింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 218 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 47, ఫాఫ్ డూ ప్లెసిస్ 54, రజత్ పాటిదార్ 41, గ్రీన్ 38, మాక్స్ వెల్ 16 పరుగులతో అదరగొట్టారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, మిచెల్ శాంట్నర్, తుషార్ దేశ్ పాండే చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20వ ఓవర్లలో 7 వికెట్లకు 191 రన్స్ చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర 61, రవీంద్ర జడేజా 42*, మహేంద్ర సింగ్ ధోని 25.. రాణించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. బెంగళూరు బౌలర్లలో యష్ దయాళ్ రెండు వికెట్లు తీశాడు. మాక్స్ వెల్, మహమ్మద్ సిరాజ్, పెర్గుసన్, గ్రీన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

218 పరుగుల టార్గెట్ చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. మాక్స్ వెల్ వేసిన తొలి బంతికి రుతురాజ్ గైక్వాడ్ గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్ నాలుగు పరుగులకే యష్ దయాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో చెన్నై 19 పరుగులు మాత్రమే చేసి రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో అజింక్యా రహనే, రచిన్ రవీంద్ర జాగ్రత్తగా ఆడారు. బెంగళూరు బౌలర్లను కాచుకుంటూ బ్యాటింగ్ చేశారు. సమయం దొరికినప్పుడల్లా పేసర్లపై ఎదురుదాడికి దిగారు. అర్థ సెంచరీ వైపుగా కదులుతున్న రహానే (33)ను పెర్గూ సన్ అవుట్ చేసాడు. దీంతో 66 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

ఈ సమయంలో క్రీజు లోకి శివం దూబె వచ్చాడు. అప్పటికే రచిన్ రవీంద్ర అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాక్స్ వెల్ వేసిన 13 ఓవర్లో శివం దూబే ఇచ్చిన సులభమైన క్యాచ్ ను సిరాజ్ పట్టుకోలేకపోయాడు. అయితే అదే ఓవర్ లో శివం దూబే నిర్లక్ష్యం వల్ల రచిన్ రవీంద్ర రన్ అవుట్ అయ్యాడు. ఇది మ్యాచ్ ను బెంగళూరు వైపు తిప్పింది. గ్రీన్ వేసిన మరుసటి ఓవర్లో శివం దూబే క్యాచ్ అవుట్ అయ్యాడు.. సిరాజ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన శాంట్నర్ (3) డూ ప్లెసిస్ పట్టిన క్యాచ్ కు ఔట్ అయ్యాడు. ఈ దశలో మహేంద్రసింగ్ ధోని, రవీంద్ర జడేజా జోడి రెండు ఓవర్లలో ఏకంగా 32 పరుగులు చేసింది.

ఈ దశలో చెన్నై ప్లే ఆఫ్ వెళ్లేందుకు 12 పరుగులకు 35 పరుగులు కావాల్సి వచ్చింది. ఫెర్గుసన్ వేసిన ఓవర్లో జడేజా 6, 4 కొట్టాడు. ధోని 4 బాదడంతో ఆ ఓవర్లో 18 రన్స్ వచ్చాయి. చివరి చివర్లో చెన్నై జట్టుకు 17 పరుగులు అవసరమయ్యాయి. యశ్ దయాళ్ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. బెంగళూరు విజయం ఖాయమైంది. దర్జాగా ప్లే ఆఫ్ కు వెళ్లిపోయింది.