Rajasthan Royals CEO Jake Lush McCrum: ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో వార్న్ ఆధ్వర్యంలో రాజస్థాన్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. అయినప్పటికీ ఆ జట్టు మీద అంచనాలు తారస్థాయిలోనే ఉంటాయి. ఎంతో మంది ప్లేయర్లు ఆ జట్టులోకి వచ్చి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది. తాజా సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఇలాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎందుకో రాజస్థాన్ జట్టు అంచనాలకు మించి రాణించలేకపోతోంది. అదే ఆ జట్టును తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది.
Also Read: సుమన్ శెట్టి మౌనానికి కారణం ఏంటి..? ఇలా ఐతే కష్టమేనా.?
2024 t20 వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియా నుంచి రాహుల్ ద్రావిడ్ బయటికి వచ్చాడు. నేరుగా తనకు అవకాశం కల్పించిన రాజస్థాన్ జట్టులోకి ప్రవేశించారు. శిక్షకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. వాస్తవానికి 2025 సీజన్లో రాజస్థాన్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ జట్టులో ఆటగాళ్లు వర్గాలుగా విడిపోయి ఓటములను కొని తెచ్చుకున్నారు. వర్గపోరు తట్టుకోలేక సంజు శాంసన్ కొన్ని మ్యాచ్ లలో ప్రాతినిధ్యం కూడా వహించలేదు. గాయం అయిందని పలు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో పరాగ్ నాయకత్వం వహించాడు.
రాజస్థాన్ జట్టు ఓటములు సాధించడం.. ఐపీఎల్ లో అదమ స్థాయిలో ఉండడంతో.. మేనేజ్మెంట్ రంగంలోకి దిగింది. రాహుల్ ద్రావిడ్ మీద అదనపు బాధ్యతలను వేయడానికి సిద్ధమైంది. కానీ దానికి అతడు సమ్మతం తెలపలేదు. దీంతో రాజస్థాన్ జట్టు మేనేజ్మెంట్ కు, అతడికి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. దీంతో ద్రావిడ్ జట్టు నుంచి బయటికి వచ్చాడు. అతడి స్థానంలో సంగక్కర ను శిక్షకుడిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగానే రాజస్థాన్ జట్టు నుంచి మరొక వ్యక్తి బయటకు వచ్చాడని ప్రచారం జరుగుతోంది.
జాతీయ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం రాజస్థాన్ జట్టు సీఈవో జేక్ లష్ మెక్ క్రమ్ బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. జట్టును మాత్రమే కాకుండా కీలక స్థానాలను కూడా ప్రక్షాళన చేయాలని మేనేజ్మెంట్ భావించినట్టు తెలుస్తోంది. అందువల్లే జేక్ ను తొలగించినట్లు సమాచారం.. అయితే దీనిపై ఇంతవరకు రాజస్థాన్ జట్టు మేనేజ్మెంట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.. జేక్ కూడా ఇంతవరకు ఎటువంటి విషయాన్ని వెల్లడించలేదు. కాగా, ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి.. వచ్చే ఐపిఎల్ లో రాజస్థాన్ జట్టు ఆడుతుందా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.