కోచ్ ద్రవిడ్ ఏంటీ.. రవిశాస్త్రిని తీసేశారా? కెప్టెన్ ఎవరు ఏంటీ.. కోహ్లీనే కదా? అనుకుంటున్నారా? ఇప్పటికీ టీమిండియా కోచ్ అండ్ కెప్టెన్ వారిద్దరే. అయితే.. ద్రవిడ్ ను కూడా కోచ్ గా నియమిస్తున్నారట. అయితే.. ప్రధాన జట్టుకు కాదు. రెండో టీమ్ కోసం! అవును.. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు త్వరలో ఇంగ్లండ్ పయనం అవుతున్న సంగతి తెలిసిందే. మరోమూడు వారాల్లో ఇంగ్లాండ్ లో దిగనుంది. జూన్ 18 నుంచి 22 మధ్య న్యూజీలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడుతుంది.
ఆ తర్వాత కూడా అక్కడే ఉంటుంది. కొన్ని వార్మప్ మ్యాచులు ఆడుతుంది. అనంతరం ఆగస్టులో ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఇలా.. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని తిరిగి భారత్ చేరుకోవడానికి మూడు నెలలు పడుతుంది. అయితే.. జులైలో శ్రీలంక పర్యటనకు సైతం సిద్ధమవుతోంది టీమిండియా!
అయితే.. అప్పటికి ఇంగ్లండ్ లో ఉండే కోహ్లీ నేతృత్వంలోని జట్టు.. శ్రీలంకకు రాలేదు కాబట్టి మరో జట్టును పంపేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ఈ విషయాన్ని అధ్యక్షుడు గంగూలీ వెల్లడించారు. శ్రీలంక పర్యటనలో టీమిండియా 5 మ్యాచుల టీ20 సిరీస్, 3 వన్డేల మ్యాచుల సిరీస్ ఆడనుంది.
మరి, కోహ్లీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లండ్ వెళ్లిపోతే.. శ్రీలంక వెళ్లేది ఎవరు? అన్నప్పుడు పలువురి పేర్లు చర్చకు వస్తున్నాయి. వారిలో కొందరు సీనియర్లు కూడా ఉన్నారు. ఇంగ్లండ్ పర్యటనకు దూరంగా ఉంచిన శిఖర్ ధావన్, హార్డిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహల్, యుజ్వేంద్ర చాహల్ వంటి వారు ఈ జట్టులో ఉంటారు. వీరితో మరికొందరు కుర్రాళ్లు జతకలుస్తారు.
వారిలో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్,రాహుల్ చాహర్, దేవ్ దత్ పడిక్కల్, రాహుల్ తెవాతియా వంటి వారు ఉండే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుంటే.. శ్రేయస్ అయ్యర్ కూడా లంక వెళ్తాడు. ఈ సిరీస్ టీ20 ప్రపంచ కప్ కు ముందు సన్నాహకంగా ఉంటుందని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.
ఈ రెండో జట్టుకు కోచ్ గా ద్రవిడ్ వ్యవహరించబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ ద్రవిడ్ ను కోరిందని కూడా తెలిసింది. ద్రవిడ్ తోపాటు నేషనల్ క్రికెట్ అకాడమీ సపోర్టింగ్ టీమ్ ను కూడా లంకకు పంపించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తానికి టీమిండియా రెండు జట్లుగా విదేశీ టూర్ కు వెళ్లబోతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.