
కరోనా ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా మిత్రులు కూడా కరోనాను ఎదురించి నిలవలేకపోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల మరణాలు కొనసాగుతున్నాయి. దాదాపు 50మంది వరకు చిన్నా పెద్ద జర్నలిస్టులు అసువులు బాస్తున్నారు.
సెకండ్ వేవ్ లో మంచి రోగనిరోధక శక్తి ఉండే యువతను కూడా కరోనా బలితీసుకుంటోంది. తాజాగా ప్రముఖ జర్నలిస్టు, నటుడు టీఎన్ఆర్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది జర్నలిస్టులు మరణించడం మీడియా వర్గాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. తాజాగా ప్రముఖ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్టు, నటుడు తుమ్మల నరసింహారెడ్డి మరణం అందరినీ షాక్ కు గురిచేసింది. టీఎన్ఆర్ కరోనా తో పోరాడుతూ ప్రాణాలు విడిచాడు.
టీఎన్ఆర్ ‘నేనే రాజు నేనే మంత్రి’, సుబ్రహ్మణ్యపురం, ఫలకునూమా దాస్, జార్జ్ రెడ్డి, సవారీ, హిట్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల్లో నటించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయనకు ఎఫ్3లో నటించే అవకాశం కూడా వచ్చిందని టాక్ వినిపించింది. కానీ ఆ సినిమాలో నటించకుండానే ఆయన అకాల మరణం పొందారు.
టీఎన్ఆర్ వయసు 45 ఏళ్లు. ఈయనది హైదరాబాద్ యే. మల్కాజిగిరిలో జన్మించారు. సైదాబాద్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్ లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఎంతో చురుకుగా ఉండే ఈయన చనిపోవడం తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర నిరాశలోకి నెట్టింది. టీఎన్ఆర్ కు చిరంజీవి అంటే చాలా ఇష్టం . ఆ ఇష్టంతోనే దర్శకుడు కావాలని తపనపడ్డాడు. 1992లో దేవదాస్ కనకాల శిక్షణలో దర్శకత్వం మెళకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత కమెడియన్ ఎల్బీ శ్రీరామ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. కమెడియన్ అలీ సినిమాకు స్క్రిప్ట్ రైటింగ్ లో సహాయం అందించారు. దర్శకత్వం చాన్స్ రాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చి పలు న్యూస్ చానెల్ లలో జర్నలిస్టుగా పనిచేశారు.
ప్రముఖ యూట్యూబ్ చానెల్ లో ‘ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్’ అని మొదలు పెట్టి ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ పాపులర్ అయ్యాడు. ఇక ఆయనకు సినిమా అవకాశాలు రావడంతో వెండితెరపైకి అరంగేట్రం చేశాడు. ‘బోణి’ సినిమాలో మంత్రి పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించాడు. క్రైమ్ మూవీ ‘వై’లోనూ కీలక పాత్ర పోషించాడు. అయితే ఆయన దర్శకుడు అవ్వాలన్న కోరిక మాత్ర నెరవేరకుండానే కరోనా బారిన పడి కన్నుమూశాడు.