Rahul Dravid : రోహిత్ శర్మ బతిమిలాడినప్పటికీ.. జై షా కోరినప్పటికీ.. రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ గా కొనసాగడానికి ఒప్పుకోలేదు. తన పదవి కాలం ముగిసిన తర్వాత ద్రావిడ్ కు భారీగా ఆఫర్లు వచ్చాయి. అయితే వాటిని వద్దనుకున్నాడు. కొన్ని ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు అతనికి బ్లాంక్ చెక్కులు పంపించాయి. అయితే వాటిని అతడు తిరస్కరించాడు. అయితే ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ లోని రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
ప్రత్యేక అనుబంధం
రాహుల్ ద్రావిడ్ కు రాజస్థాన్ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2012 -13 కాలంలో రెండు సంవత్సరాలపాటు అతడు రాజస్థాన్ జట్టుకు సారధిగా వ్యవహరించాడు. ఆటగాడిగా క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. రెండు సంవత్సరాలపాటు రాజస్థాన్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు అతడు రాజస్థాన్ జట్టుతో తన ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాడు. భారత జట్టు శిక్షకుడిగా రాహుల్ ద్రావిడ్ తనదైన ముద్ర వేశాడు. రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగిసిన తర్వాత మెంటార్ లేదా కోచ్ గా కొనసాగించడానికి చాలా జట్లు సిద్ధపడ్డాయి. కాని ద్రావిడ్ ఆఫర్లను వద్దనుకున్నాడు. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజస్థాన్ జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచింది. అతడిని జట్టులోకి తీసుకుంది. దానికి కృతజ్ఞతగా మళ్లీ ఆ జట్టుకు సేవలు అందించేందుకు రాహుల్ ద్రావిడ్ శిక్షకుడిగా మారాడు.
ఐపీఎల్ ప్రారంభంలో..
ఐపీఎల్ ప్రారంభంలో 2008 నుంచి 2010 వరకు రాహుల్ ద్రావిడ బెంగళూరు జట్టుకు ఆడాడు. ఆ మూడు సీజన్లలో 371, 271, 256 రన్స్ చేశాడు. ఇక 2011 సీజన్ కు ముందు వేలం జరగగా.. రాహుల్ ద్రావిడ్ కోసం బెంగళూరు బిడ్ దాఖలు చేయలేదు. ఇతర జట్ల యాజమాన్యాలు కూడా అతనిని కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఈ సమయంలో రాహుల్ ద్రావిడ్ పై రాజస్థాన్ యాజమాన్యం పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచింది. అతడి కోసం బిడ్ దాఖలు చేసింది. 2011లో రాజస్థాన్ జట్టు తరఫున 343 రన్స్ చేసిన ద్రావిడ్.. 2012లో సారధిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 462 పరుగులు చేశాడు.
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత..
2013లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో కొంతమంది రాజస్థాన్ ఆటగాళ్లు జీవితకాలం నిషేధానికి గురయ్యారు. అయినప్పటికీ రాహుల్ ద్రావిడ్ తన జట్టును ధైర్యంగా ముందుకు నడిపించాడు. ఆటగాడిగా 471 రన్స్ చేశాడు. 2008 తర్వాత రాజస్థాన్ జట్టును తొలిసారిగా ప్లే ఆఫ్ దాకా తీసుకెళ్లాడు. 2011లో తనపై నమ్మకం ఉంచి బిడ్ దాఖలు చేసిన రాజస్థాన్ జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతగా రాహుల్ ద్రావిడ్ కోచ్ గా మారాడు. టీమిండియా పై విజయవంతమైన హెడ్ కోచ్ గా తనదైన ముద్ర వేసుకున్న రాహుల్ ద్రావిడ్.. వచ్చే సీజన్ లో రాజస్థాన్ జట్టును ఎలా నడిపిస్తాడో వేచి చూడాల్సి ఉంది.