Rafael Nadal : ఆధునిక టెన్నిస్లో ఎంతోమంది గొప్ప ప్లేయర్లు ఉండవచ్చు గాక. వారందరూ ఎన్నో గ్రాండ్ స్లామ్ లు సొంతం చేసుకోవచ్చు గాక. కానీ స్పానిష్ టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్ కు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. స్పానిష్ ఆటగాడైనప్పటికీ ఫ్రెంచ్ ఓపెన్ లో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నాడు ఈ ఆటగాడు. బలమైన ఫోర్ హాండ్ షాట్లు కొట్టి గొప్ప ప్లేయర్లను సైతం మట్టికరిపించాడు. మట్టిలో మాణిక్యం అనే సామెతను నిజం చేసి చూపించాడు. ఒక సీజన్ కాదు , రెండు సీజన్లు కాదు.. సీజన్లకు సీజన్లు ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించాడు. వింబుల్ డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ వంటి గ్రాండ్ స్లామ్ లలో మిగతా ప్లేయర్లు సత్తా చూపిస్తుంటే.. అతడు మాత్రం అందులోను.. మట్టి కోర్టులోనూ అదరగొట్టాడు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెల్చుకున్నాడు. అయితే ఉవ్వెత్తున ఎగిసిన అతడు.. ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీనికి తోడు గాయాలు కావడంతో కెరియర్ ప్రమాదకరంలో పడింది. వరుస ఓటములు అతడిని ఇబ్బంది పెట్టాయి. దీంతో అతడు ఆటకు స్వస్తి పలకక తప్పలేదు.
స్పానిష్ లెజెండ్ గా పేరుపొందిన అతడు ఫ్రెంచ్ కింగ్ అయ్యాడు. ఉన్నంతసేపు మట్టి కోర్టులో సంచలనాల సృష్టించాడు. ఫెదరర్, జకోవిచ్, ముర్రే వంటి దిగ్గజాలను ఓడించాడు. తద్వారా టెన్నిస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏకంగా 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నాడు.. కింగ్ ఆఫ్ క్లే గా ముద్ర వేసుకున్నాడు. మొత్తానికి అతడు తన టెన్నిస్ ప్రస్తానానికి ముగింపు పలికాడు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు అతనికి ఘనమైన వీడ్కోలు పలికారు. మట్టి కోర్టులో అతడు సృష్టించిన సంచలనాలకు గుర్తుగా “పాదముద్ర”ను కోర్టులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదల్ భావోద్వేగానికి గురయ్యాడు. ” ఈ ప్రయాణం ముగిసినందుకు బాధగానూ.. గర్వం గానూ ఉంది. ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించాను. కాకపోతే ఇంత బరువుగా ఉంటుందని ఊహించలేదు.. నన్ను మట్టి కోర్టు మొనగాడిగా అందరూ భావించారు. వారి ప్రేమకు నా ధన్యవాదాలు. ఈ ప్రయాణం ఇక్కడితోనే ఆగిపోదు. మీరు ఇచ్చిన స్ఫూర్తి మరో రూపంలో కనిపిస్తుందని” నాదల్ కన్నీటి పర్యంతమవుతూ వ్యాఖ్యానించాడు. తన ప్రత్యర్థులు ఫెదరర్, జకోవిచ్, ముర్రే ను ఆలింగనం చేసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. నాదల్ వీడ్కోలు సమయంలో.. ప్రేక్షకులు గట్టిగా నినాదాలు చేశారు. నాదల్ వి మిస్ యువర్ గేమ్ అంటూ గట్టిగా అరిచారు. “నీ ఆట ద్వారా మమ్మల్ని ఇన్ని రోజులపాటు సమ్మోహితులను చేశావు. నీ ఆటను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని” ప్రేక్షకులు వ్యాఖ్యానించారు.
Also Read : మట్టి వీరుడు.. రాకెట్ తో ట్రోఫీలు కొల్లగొట్టిన ఘనుడు.. ఆధునిక టెన్నిస్ ప్రపంచంలో రఫెల్ నాదల్ ఓ పెను సంచలనం!