https://oktelugu.com/

Viral video : ఏమా క్యాచ్.. రాధా యాదవ్ ఫీల్డింగ్ కు బిత్తర పోయిన న్యూజిలాండ్ క్రికెటర్.. వైరల్ వీడియో

భారత మహిళల జట్టు న్యూజిలాండ్ జట్టుతో అహ్మదాబాద్ వేదికగా రెండవ వన్డే ఆడుతోంది. ఇదే వేదికగా ఇటీవల జరిగిన తొలి వన్డేలో టీమిండియా న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ సాధించిన విజయగర్వంలో ఉన్న కివీస్ జట్టును నేలకు దించింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 29, 2024 4:38 pm
    Radha Yadav

    Radha Yadav

    Follow us on

    Viral video :  అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ప్లేయర్ రాధా యాదవ్ అద్భుతమైన ఫీల్డింగ్ చేసింది. ఒంట్లో ఎముకలు లేవనట్టుగా అమాంతం గాల్లోకి ఎగిరి న్యూజిలాండ్ బ్యాటర్ ఆడిన భారీ షాట్ ను అమాంతం పట్టుకుంది. మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేసి ఆకట్టుకుంది. ఫీల్డింగ్ లో మాత్రమే కాదు, బౌలింగ్ లోనూ 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లు నేల కూల్చింది.

    ఎక్స్ ట్రా కవర్ మీదుగా..

    న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో ప్రియా మిశ్రా బౌలింగ్లో కివీస్ బ్యాటర్ హాలిడే దూకుడు కొనసాగించింది.. ప్రియా మిశ్రా వేసిన ఓ బంతిని ఎక్స్ ట్రా కవర్ మీదుగా షాట్ కొట్టింది. అయితే ఆ గ్యాప్ లో ఫీల్డర్లు లేరు. కానీ రాధా యాదవ్ ఊహించని విధంగా క్యాచ్ అందుకుంది. తన వృత్తం నుంచి వెనకకు పరిగెత్తుతూ.. అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకుంది. స్పైడర్ మాన్ లాగా డైవ్ చేసి బంతిని పట్టుకుంది. హాలిడే అవుట్ కావడం ద్వారా ప్రియా మిశ్రా అంతర్జాతీయ క్రికెట్లో తొలి వికెట్ దక్కించుకుంది. అయితే ఈ క్రెడిట్ మొత్తం రాధా యాదవ్ కే దక్కుతుంది.

    ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 259 రన్స్ చేసింది. కెప్టెన్ సోఫీ 79, సుజీ బేట్స్ 58 పరుగులతో ఆకట్టుకున్నారు. మ్యాడి గ్రీన్ 42 రన్స్ చేసింది. ప్లిమ్మర్ 41 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 4 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ రెండు వికెట్లు సాధించింది. ప్రియా మిశ్ర, సైమ చెరో వికెట్ పడగొట్టారు. తొలి వన్డేలో తేలిపోయిన న్యూజిలాండ్ జట్టు.. రెండవ వన్డేలో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడి సుజి – గ్రీన్ తొలి వికెట్ కు 87 పరుగులు జోడించారు. అయితే దీప్తి గ్రీన్ ను వెనక్కి పంపించడంతో.. తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం భారత బౌలర్లు సత్తా చాటడంతో న్యూజిలాండ్ జట్టు 139 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.. ఈ క్రమంలో మ్యాడి గ్రీన్, కెప్టెన్ డివైన్ ఐదో వికెట్ కు 82 పరుగులు జోడించారు. అయితే చివర్లో న్యూజిలాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడం విశేషం. ఈ మ్యాచ్లో భారత ప్లేయర్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. కీలక సమయాలలో భారీగా పరుగులు చేయకుండా నిరోధించగలిగారు.