Paralympics 2024 : వైకల్యాన్ని అధిగమించి.. స్వర్ణాన్ని సాధించాడు.. పారాలింపిక్స్ లో దూసుకుపోతున్న భారత్..

పారాలింపిక్స్ లో భారత దేశం మరో స్వర్ణాన్ని సాధించింది. పోటీలు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన కుర్చీల హై జంప్ టీ 64 విభాగంలో ప్రవీణ్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈవెంట్ ఫైనల్ లో 2.08 మీటర్ల ఎత్తు దూకి మొదటి స్థానంలో నిలిచాడు. ఇదే సమయంలో అతడు ఆసియా రికార్డును కూడా బ్రేక్ చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 6, 2024 7:34 pm

Praveen Kumar

Follow us on

Paralympics 2024 :  ఈ పోటీలో అమెరికాకు చెందిన డెరెక్ లోసియంట్ 2.06 మీటర్ల ఎత్తు సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఉజ్బెకిస్తాన్ పారా అథ్లెట్ టెముర్ బెక్ 2.03 మీటర్ల ఎత్తు కాంస్యం సాధించాడు. పారాలింపిక్స్ పోటీలలో బంగారు పతకం సాధించిన రెండవ పారా హై జంపర్ గా ప్రవీణ్ రికార్డు సృష్టించాడు. మరియప్పన్ తంగవేలు లాంగ్ జంప్ విభాగంలో అతనికంటే ముందు గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు.

ప్రవీణ్ కుమార్ స్వర్ణం సాధించడం ఇది రెండవసారి. టోక్యో పారాలింపిక్స్ లో హై జంప్ టీ 64 ఈవెంట్ లో అతడు సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఏషియన్ పారా గేమ్స్ లో గోల్డ్ మెడల్ దక్కించుకున్న అతడు.. పారిస్ లోనూ అదే ఘనతను కొనసాగించాడు. ప్రవీణ్ కుమార్ స్వర్ణం సాధించిన నేపథ్యంలో భారత్ మెడల్స్ సంఖ్య 26 కు పెరిగింది. జాబితాలో ఆరు గోల్డ్, 9 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.

వైకల్యాన్ని అధిగమించి .

ప్రవీణ్ కుమార్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్. నోయిడా లోని గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన ఇతడు.. వైకల్యంతోనే జన్మించాడు. ప్రవీణ్ కుమార్ కు ఒక కాలు చిన్నగా ఉంటుంది. వైకల్యం వల్ల అతడు చిన్నప్పటినుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసంతో ఎన్నో ఆటల్లో ప్రతిభ చాటాడు. వైకల్యం ఉన్నప్పటికీ వాలీబాల్ అద్భుతంగా ఆడేవాడు. ఆ రోజుల్లో పారా అథ్లెటిక్ కోచ్ డాక్టర్ సత్యపాల్ సింగ్ ఆధ్వర్యంలో పారా హై జంప్ కు తన దృష్టి మళ్లించాడు. ఏషియన్ పారా గేమ్స్ 2022లో గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో అందరి దృష్టి అతడి పై పడింది. ఇక అక్కడి నుంచి తనకు తాను సాన పెట్టుకుంటూ ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. ప్రతి టోర్నీలోనూ సత్తా చాటుతూ.. మెడల్స్ సాధిస్తున్నాడు. తాజాగా పారాలింపిక్స్ లో స్వర్ణం గెలిచి సత్తా చాటాడు. భారత ప్రతిష్టను విశ్వ క్రీడా వేదికపై పెంచాడు.

పలువురి అభినందనలు

ప్రవీణ్ కుమార్ స్వర్ణం సాధించిన నేపథ్యంలో పలువురు అభినందనలు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి వరకు ప్రవీణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవీణ్ కుమార్ ప్రదర్శన భారత దేశానికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడుతున్నారు. అతడు వైకల్యాన్ని కూడా సవాల్ చేసి స్వర్ణాన్ని సాధించడం గొప్ప విషయమని చెబుతున్నారు. అతడి క్రీడా స్ఫూర్తిని మిగతా ఆటగాళ్లు కూడా అనుసరించాలని సూచిస్తున్నారు.