Praful Hinge: ఈ ఐపిఎల్ సీజన్లో రాజస్థాన్ జట్టు వరస విజయాలు సాధించింది. చెన్నై నుంచి మొదలు పెడితే బెంగళూరు వరకు ఏ జట్టును కూడా వదిలిపెట్టలేదు. బౌలింగ్లో ఆర్చర్, సందీప్ శర్మ, బర్గర్ దుమ్మురేపుతున్నారు. బ్యాటింగ్లో జైస్వాల్, సూర్య వంశీ, జూరెల్ మెరుపులు మెరిపిస్తున్నారు. ఫలితంగా రాజస్థాన్ జట్టు టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. అంతగా అంచనాలు లేని ఆటగాళ్లతో సంచలనాలు సృష్టిస్తోంది.
అంతటి స్థాయి ఉన్న రాజస్థాన్ జట్టుకు 24 సంవత్సరాల యువకుడు చుక్కలు చూపించాడు. పరుగుల వరద పారే ఐపీఎల్లో వికెట్ల వేట సాగించాడు. అంతేకాదు దూకుడు మీద ఉన్న రాజస్థాన్ జట్టుకు కళ్లెం వేశాడు. అంతటి బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వల్ల కానిది.. ఇతడు చేసి చూపించాడు. అంతేకాదు వరస ఓటములతో తీవ్రమైన నిరాశతో ఉన్న హైదరాబాద్ జట్టుకు జవసత్వాన్ని అందించాడు.
హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో 24 సంవత్సరాల బౌలర్ ప్రఫుల్ హింజ్ అదరగొట్టాడు.. కుడి చేతి వాటం సీమ్ బౌలింగ్ తో సంచలనం సృష్టించాడు.. ఒకే ఓవర్ లో వైభవ్ సూర్య వంశీ (0), జురెల్(0), ప్రిటోరియస్(0) వికెట్లను పడగొట్టాడు. ముగ్గురు ప్లేయర్లు కూడా 0 పరుగులకే అవుట్ కావడం ఇక్కడ విశేషం. ప్రఫుల్ రెడ్ సాయిల్ పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని పూర్తిగా అందిపుచ్చుకున్నాడు. పైగా బంతి మీద నియంత్రణ కొనసాగించడంతో.. ప్రత్యర్థి బ్యాటర్లకు క్రీజులో ఉండటమే ఇబ్బందిగా మారిపోయింది. ఫలితంగా రాజస్థాన్ జట్టు తీవ్రమైన కష్టాల్లో పడింది.
నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో హింజ్ పేరు మార్మోగిపోతుంది. సోషల్ మీడియాలో అయితే అతని గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. హింజ్ గురించి అభిమానులు తెగ శోధిస్తున్నారు. ఇతడు విదర్భకు చెందిన కుడి చేతి వాటం సీమ్ బౌలర్. రెడ్ బాల్ క్రికెట్ లో క్రమంగా తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. కేవలం 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లోనే 26.7 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఇతడికి టి20 క్రికెట్లో పరిమిత అనుభవం మాత్రమే ఉంది. ఆడిన ఏకైక మ్యాచ్లో తనదైన ముద్ర వేశాడు.. ఆంధ్ర జట్టు పై ఉమేష్ యాదవ్ తో కలిసి బౌలింగ్ వేసిన ఇతడు 4 ఓవర్లలో.. 23 పరుగులు వచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభం కంటే ముందు ఇతడిని హైదరాబాద్ జట్టు బ్యాకప్ పేస్ బౌలర్ గా నియమించుకుంది. 30 లక్షలకు ఇతడిని కొనుగోలు చేసింది. ఇతడి కెరియర్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది.. హైదరాబాద్ జట్టులో కమిన్స్, జయదేవ్, హర్షల్ వంటి వారు ఉన్నచోట.. ఇతడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రారంభ మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు అంటే ఇతడి బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అదనపు బౌలర్ గా పడి ఉంటాడని కావ్య ఇతడిని 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంతవరకు అతడికి అవకాశం ఇవ్వలేదు. అవకాశాలు ఇచ్చిన బౌలర్లు నిరూపించుకోలేకపోతున్నారు. దీంతో సోమవారం నాటికి మ్యాచ్లో ఇతడికి మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. పెద్దగా అంచనాలు లేకపోవడంతో.. ఒత్తిడి లేకుండా రంగంలోకి దిగాడు ప్రఫుల్. ఆ తర్వాత తన సత్తా చూపించాడు. పడి ఉంటాడు లే అని కొనుగోలు చేసిన కావ్యతో డ్యాన్స్ వేయించాడు.
