Pickle ball game: క్రికెట్ మేనియా తో ఊగిపోయే మన దేశంలోకి పికిల్ బాల్ ఎంట్రీ.. ఏమిటీ గేమ్? నిబంధనలను ఎలా ఉంటాయంటే?

మనదేశంలో క్రికెట్ అంటే చాలు యువత నుంచి వృద్ధుల వరకు చెవి కోసుకుంటారు. టీమిండియా ఆడే మ్యాచ్ లను ఫోన్ లకు, టీవీ లకు అతుక్కుపోయి చూస్తుంటారు.. అలాంటి మనదేశంలోకి కొత్త క్రీడ ఎంట్రీ ఇచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 23, 2024 9:21 am

Pickle ball game

Follow us on

Pickle ball:  ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ జట్టును కూడా కొనుగోలు చేసింది. దీంతో ఒకసారిగా పికిల్ బాల్ ఆటపై చర్చ మొదలైంది. అయితే ఈ ఆట ఎలా ఉంటుంది? ఎలాంటి నిబంధనలు పాటించాలి? అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.. దీనిపై నెట్ లో తెగ శోధన మొదలుపెట్టారు..పికిల్ బాల్ అనే క్రీడ అమెరికాలో ప్రారంభమైంది. ఇది బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్ లాగా ఉంటుంది. 1965లో పికిల్ బాల్ గేమ్ మొదలైంది. మనదేశంలోకి ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలోనూ పికిల్ బాల్ టోర్నీలు జరుగుతున్నాయి.. అయితే ఈ క్రీడను ఇండోర్, ఔట్ డోర్ విధానంలో ఆడొచ్చు. సింగిల్స్ విభాగంలో ఇద్దరు, డబుల్స్ విభాగంలో నలుగురు ఆడేందుకు అవకాశం ఉంటుంది. మిక్స్ డ్ డబుల్స్ లోనూ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీలలో భాగంగా కర్రతో రూపొందించిన పాడిల్, హార్డ్ ప్లాస్టిక్ బాల్ ఉపయోగిస్తారు.

నిబంధనలు ఎలా ఉంటాయంటే

పికిల్ బాల్ ఆడేందుకు ఉపయోగించే మైదానం 44 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉంటుంది. నెట్ ఎత్తు 36 అంగుళాలు మాత్రమే ఉంటుంది. టెన్నిస్ లో రెండు ఫాల్ట్ లు సర్వీస్ పోతుంది. పికిల్ బాల్ లో మాత్రం ఒకే ఒక్క ఫాల్ట్ ఉంటుంది. డబుల్స్ లో మాత్రం ఒకేసారి సర్వ్ చేసే అవకాశం ఉంటుంది. మ్యాచ్ మొదలైన తర్వాత ఒక్కసారైనా బంతి నేలపై బౌన్స్ అయితేనే షాట్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నేరుగా బంతిని కొట్టొచ్చు. పికిల్ బాల్ గేమ్ లో సర్వ్ చేసినప్పుడు మాత్రమే పాయింట్లు దక్కుతాయి. ప్రతి సెట్ 11 పాయింట్లు పూర్తికాగానే ముగుస్తుంది. విజేతను రెండు పాయింట్ల తేడాతో ప్రకటిస్తారు. టెన్నిస్ మాదిరి లాంగ్ సర్వ్ చేసినప్పుడు లేదా ఆటలో భాగంగా నెట్ ను బంతి దాటి పోవలసి ఉంటుంది.. సర్వ్ చేసే క్రమంలో నో వ్యాలీ జోన్ దగ్గర బంతిని అందుకోవద్దు.

పికిల్ బాల్ క్రీడను అమెరికాకు చెందిన రాజకీయ నాయకుడు జోయల్ ప్రిట్చర్డ్ తొలిసారిగా తన కుటుంబంతో ఆడాడు.. అనంతరం ఆయన భార్య జోన్ ఈ క్రీడకు విశేషమైన ప్రాధాన్యం తీసుకొచ్చింది..” రోయింగ్ లో పికిల్ బోట్ అయితే ఎలా ఉంటుందో.. ఈ ఆట కూడా అలానే సాగుతుంది. అందువల్లే దీనికి పికిల్ బాల్ అనే పేరు పెట్టినట్టు” ఆమె పేర్కొంది..జోయల్ ప్రిట్చర్డ్ ఒక కుక్కను పెంచుకునేవాడు. దానికి పికిల్స్ అని పేరు పెట్టాడు..జోయల్ ప్రిట్చర్డ్ తన కుటుంబంతో ఈ గేమ్ ఆడినప్పుడు.. ఆ బంతిని పట్టుకు వచ్చేందుకు ఆ కుక్క పరిగెత్తేది. అందువల్లే ఈ గేమ్ కు పికిల్ బాల్ అనే పేరు పెట్టారని మరో వాదన కూడా ఉంది. అమెరికాలో ఈ ఆటకు విపరీతమైన క్రేజీ ఉంటుంది. చాలామంది దీన్ని సరదాగా ఆడటం మొదలుపెట్టి.. దేశం మొత్తం విస్తరించారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఈ క్రీడకు సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్త క్రీడగా విస్తరించింది కెనడా, ఇంగ్లాండ్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, చైనా, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలలో ఈ క్రీడకు విస్తృతమైన ఆదరణ ఉంది. ఇండియాలో మాత్రం ఇప్పుడిప్పుడే ఇది ఎంట్రీ ఇస్తోంది.