PCB: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. టీమిండియా అద్భుతంగా ఆడటంతో పాకిస్తాన్ జట్టు ఆసియా కప్ లో వరుసగా టీమిండియా చేతిలో మూడవ ఓటమిని ఎదుర్కొంది. తద్వారా అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ జట్టు మాజీ ఆటగాళ్లు.. సీనియర్ ఆటగాళ్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో విమర్శలకైతే లెక్కేలేదు. ఇలాంటి దశలో పుండు మీద కారం చల్లినట్టు పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లకు కోలుకోలేని షాక్ తగిలింది.
ఆసియా కప్ లో భారత జట్టు చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆదేశ క్రికెట్ బోర్డు దారుణమైన శిక్ష విధించింది. విదేశీ టీ20 లీగ్, టోర్నమెంట్లలో ఆడేందుకు ఇచ్చే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాటిని హోల్డ్ లో పెడుతున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేకంగా కారణాల చెప్పకపోయినప్పటికీ.. “ముందుగా అంతర్జాతీయ వేదికలలో రాణించండి.. ఆ తర్వాత మిగతా క్రికెట్ మ్యాచ్లు ఆడుదురు గాని” అన్నట్టుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరికలు పంపినట్టు ఆ
దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొదటి నుంచి కూడా ఆటగాళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే శిక్షణ.. అజమాయిషి విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.. కోచింగ్ విషయంలో కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏకపక్ష ధోరణి కొనసాగిస్తోంది. మేనేజ్మెంట్లో పెత్తనాలు పెరిగిపోయాయి. దీంతో కోచ్ లు నిలకడగా ఉండలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్లేయర్లు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జట్టులో ఏకతాటిపైకి వచ్చే వాతావరణం కనిపించడం లేదు. దీంతో ఆటలో సమష్టి తత్వం దూరమవుతోంది. అంతిమంగా గెలవాల్సిన చోట ఓటమి ఎదురవుతోంది.
టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడానికి స్వయంకృతాపరాధమే ప్రధాన కారణం. ఆటగాళ్లు సరైన స్థాయిలో ఆటలేకపోయారు. మొదట్లో అద్భుతంగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత తేలిపోయారు. భారత బౌలర్లు ముందుగా తేలిపోయినప్పటికీ.. ఆ తర్వాత పట్టు సాధించారు. బ్యాటర్లు కూడా ముందుగా త్వరత్వరగానే అవుట్ అయినప్పటికీ.. అనంతరం వచ్చినవారు నిలబడ్డారు. కడదాకా దృఢంగా నిలబడి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు.