Rishabh Pant : పై ఉపోద్ఘాతం మొత్తం కూడా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు ప్రమాదానికి గురై వచ్చిన అతడు ఈ స్థాయిలో ఆడతాడని ఎవరూ ఊహించలేదు. ఇంత రేంజ్ లో దుమ్ము రేపు తాడని ఎవరూ అంచనా వేయలేదు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టును ముందుండి నడిపాడు..టి20 వరల్డ్ కప్ లో తనదైన శైలిలో ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోను తన మార్క్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా టెస్టులో తనదైన బ్యాటింగ్ చేయనప్పటికీ.. అద్భుతమైన వికెట్ కీపింగ్ తో అలరిస్తున్నాడు. అయితే అటువంటి రిషబ్ పంత్ ను ఢిల్లీ జట్టు వదిలేసుకుంది. రైట్ టు మ్యాచ్ ద్వారా కొనుగోలు చేయాలని భావించింది. కానీ ఢిల్లీ జట్టు ఆశలపై లక్నో యాజమాన్యం నీళ్లు చల్లింది. 17 కోట్లకు రైట్ టు మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ ను కొనుగోలు చేయాలని భావించినప్పటికీ.. లక్నో యాజమాన్యం ఏకంగా 27 కోట్ల ధర కోట్ చేసి రిషబ్ పంత్ ను దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ 26.75 కోట్లను కొనుగోలు చేయగా.. మరో 25 లక్షలు అదనంగా పెట్టి లక్నో జట్టు రిషబ్ పంత్ ను దక్కించుకుంది. 27 కోట్ల ద్వారా ఐపీఎల్లో రిషబ్ పంత్ సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించాడు. గతంలో స్టార్క్ పేరు మీద ఉన్న రికార్డును పటా పంచలు చేశాడు.
ఎంత దక్కుతుందంటే..
ఐపీఎల్ చరిత్రలో 27 కోట్లకు అమ్ముడుపోయినప్పటికీ.. రిషబ్ పంత్ కు 18.9 కోట్లు మాత్రమే చేతికి వస్తుంది.. ఎందుకంటే 8.1 కోట్లు పన్ను రూపంలో వెళుతుంది. ఇలా లక్నో జట్టు నుంచి పంత్ 18.9 కోట్లు వేతనంగా స్వీకరిస్తాడు. ఒకవేళ ఈ టోర్నికి ముందు గాయాలపాలైతే.. వ్యక్తిగత కారణాలవల్ల తప్పుకుంటే లక్నో జట్టు రిషబ్ పంత్ కు ఒక రూపాయి కూడా ఇవ్వదు. ఒకవేళ టోర్నీలో ఆడుతూ.. మధ్యలో గాయపడి తప్పుకుంటే మాత్రం పూర్తి వేతనాన్ని లక్నో యాజమాన్యం రిషబ్ పంత్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ టోర్నీకి ముందు విదేశీ ఆటగాళ్లు గాయపడితే వారికి ఎటువంటి పరిహారం ఇవ్వరు. టీమిండియా కు ఆడుతూ గాయపడిన మన ప్లేయర్లకు మాత్రం బీసీసీఐ బీమా నిబంధనల ప్రకారం సీజన్ తాలూకు పూర్తి డబ్బును అందుకుంటారు.. ఇక ఒక ఆటగాడు ఒక్క మ్యాచ్ ఆడకపోయినప్పటికీ (రిజర్వ్ బెంచ్ కి పరిమితమైతే) ఫ్రాంచైజీ వారికి మొత్తం జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వ్యక్తిగత కారణాల వల్ల ఒక ఆటగాడు టోర్నీ మధ్యలో నుంచి వెళ్లిపోతే.. అతడు ఆడిన మ్యాచ్ ల సంఖ్య ఆధారంగా చెల్లింపులు చేస్తారు. ఒకవేళ టోర్నీ సమయంలో గాయపడితే.. ఫ్రాంచైజీ పూర్తి కాంట్రాక్టు మొత్తాన్ని ఆటగాడికి ఇవ్వాల్సి ఉంటుంది.