T20 World Cup 2022 Pakistan: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పరువు తీసుకుంది. రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలై అభిమానులకు నిరాశే కలిగించింది. మ్యాచ్ ల ప్రారంభానికి ముందు వారు చేసిన సెటైర్లు అందరు విచారం వ్యక్తంచేశారు. టీమిండియాను ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ప్రకటనలు చేయడంతో మన అభిమానులు ఎంతో బాధపడ్డారు. కానీ తీరా మ్యాచ్ లోకి వచ్చాక వారి ఆట అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన తరువాత మాత్రం మన వారికి అటు పిమ్మట జింబాబ్వేకు దాసోహం అనడంతో వారివి ప్రగల్బాలే అని తేలిపోయింది.

గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ఇండియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి వికెట్లు తీసిన షాహిన్ అఫ్రిది అక్కడి అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. అప్పుడు పది వికెట్ల తేడాతో ఇండియా పరాజయం పాలు కావడంతో పాటు వరల్డ్ కప్ సెమీస్ కు కూడా వెళ్లలేదు. దీంతో ఇప్పుడు కూడా షాహిన్ ప్రమాదకరంగా మారతాడని భావించినా టీమిండియా ఆటగాళ్లు అతడి బౌలింగ్ ను చీల్చి చెండాడారు. పాక్ ను ఓటమికి గురి చేసి వారివి వట్టి మాటలే అని రుజువు చేయడం గమనార్హం.
ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ కు కూడా అఫ్రిదిని పాక్ ఆయుధంగా బరిలో దింపినా అతడి బౌలింగ్ ను మనవారు సమర్థంగా ఎదుర్కొని వారికి ధీటైన జవాబు ఇచ్చారు. గత సంవత్సరం జరిగిన దానికి బదులు తీర్చుకున్నారు. అక్టోబర్ 23న జరిగిన మ్యాచ్ లో మన ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడటంతో పాక్ కు మింగుడుపడలేదు. షాహిన్ నాలుగు ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. 18వ ఓవర్లో కూడా అతడి బౌలింగ్ లో మన వారు 17 పరుగులు రాబట్టడంతో కెప్టెన్ అసహనం వ్యక్తం చేశాడు.

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లోనూ షాహిన్ బౌలింగ్ మంత్రం పనిచేయలేదు. తొలి ఓవర్లోనే 14 పరుగులు ఇవ్వడంతో కెప్టెన్ బాబర్ అతడితో బౌలింగ్ చేయించలేదు. కనీసం లోయర్ బ్యాట్స్ మెన్ ను కూడా ఔటు చేయలేకపోయాడు. వికెట్లు తీయకుండా నాలుగు ఓవర్లలో 29 పరుగులు సమర్పించుకోవడం అతడి బౌలింగ్ కు అద్దం పడుతోంది. ఇంత దానికి ఇండియా మీద మా అస్త్రం రెడీ అంటూ మాటలు కోటలు దాటే స్థాయిలో విర్రవీగడంతో ఇప్పుడు తల ఎత్తుకోలేకపోతున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన హీరో అనే సంగతి వారికి తెలియడం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు.
పాకిస్తాన్ మేనేజ్ మెంట్ అతడి ఫిట్ నెస్ పరిశీలించకుండానే ఎంపిక చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బౌలింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. పరుగెత్తడానికి కూడా ఎన్నో పాట్లు పడ్డాడు. దీంతో అతడిని బలవంతంగా వరల్డ్ కప్ కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పాక్ పరువు మాత్రం గాల్లో కలిసింది.