Homeక్రీడలుPakistan World Cup 2023: వరల్డ్ కప్ లో పాల్గొనడంపై పాక్ కీలక నిర్ణయం..!

Pakistan World Cup 2023: వరల్డ్ కప్ లో పాల్గొనడంపై పాక్ కీలక నిర్ణయం..!

Pakistan World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే భారత్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏ మ్యాచ్ ను ఏ వేదికల్లో నిర్వహించబోతున్నది షెడ్యూల్ రూపొందించి ఐసీసీకి అందించింది. ఐసీసీ కూడా బీసీసీఐ అందించిన షెడ్యూల్ ను వరల్డ్ కప్పులో పాల్గొనే దేశాలకు పంపించి అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరింది. ఈ షెడ్యూల్ పై ఒక్క పాకిస్థాన్ మినహా ఇతర దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఈ అభ్యంతరాలు నేపథ్యంలోనే భారత్ పర్యటనకు సంబంధించి సందిగ్ధత లో ఉన్న పాకిస్థాన్ జట్టు కీలక నిర్ణయం తీసుకునే దిశగా సిద్ధమైంది.

వన్డే వరల్డ్ కప్ కు ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకోసం భారత్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, భారత నిర్వహిస్తున్న వరల్డ్ కప్ లో పాల్గొనడంపై సందిగ్ధంలో ఉన్న పాకిస్తాన్ ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య గత కొన్నేళ్ల నుంచి సత్సంబంధాలు లేవు. భారత్ పూర్తిగా పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లను ఆడడం మానేసింది. రెండు ప్రభుత్వాల మధ్య ఆశించిన స్థాయిలో సంబంధాలు లేకపోవడంతో ఈ ప్రభావం భారత్ నిర్వహిస్తున్న వన్డే వరల్డ్ కప్ పైనా కనిపిస్తోంది. భారత్ పంపించిన ముసాయిదా షెడ్యూల్ ను పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఐసీసీ అందించింది. అయితే, ఈ మ్యాచ్ ల నిర్వహణ పట్ల కూడా పాకిస్తాన్ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే, భారత్ లో పర్యటించడంపైనా పూర్తిస్థాయి నిర్ణయాన్ని పాకిస్తాన్ జట్టు ఇప్పటికీ తీసుకోలేదు. షెడ్యూల్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని పాకిస్తాన్ జట్టు తీసుకుంది.

ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన పాకిస్తాన్..

వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు పాల్గొనాలా..? వద్దా..? అనే దానిపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గత కొన్నాళ్ల నుంచి దీనిపై నిర్ణయం తీసుకోకుండా నాన్చుతూ వచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయానికి వచ్చింది. భారత్ లో పాకిస్తాన్ జట్టు పాల్గొనాలా..? లేదా..? అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు అనుగుణంగా విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో – జర్దారీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆగస్టు నెలాఖరున భారత్ లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ నివేదికలో అందించే వివరాలను పరిశీలించిన తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం.. పాక్ జట్టు వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనాలా..? లేదా..? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ లో పరిస్థితులు అద్వానంగా ఉన్నాయి తప్పా.. భారత్ లో లేవని, భారత పర్యటనపై పాకిస్తాన్ జట్టు, ప్రభుత్వం అతిగా స్పందిస్తోందంటూ పలువురు క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. అసలు పూర్తిగా పాకిస్తాన్ జట్టును వరల్డ్ కప్ కు దూరంగా ఉంచాలని, వాళ్లని ఆడించకపోవడం మంచిదని పలువురు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular