IND VS PAK Match Black Magic
IND VS PAK Match : న్యూజిలాండ్ జట్టుతో ఎదురైన తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. దుబాయ్ వేదికగా ఆదివారం భారత జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ ఓడిపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 t20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశ నుంచే పాకిస్తాన్ నిష్క్రమించింది. ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ లోనూ గ్రూప్ దశ నుంచే ఎగ్జిట్ అయింది. వరుసగా మూడు ఐసిసి టోర్నీలలో గ్రూప్ దశమించి పాకిస్తాన్ ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాక్ మాజీ ఆటగాళ్లు ప్రస్తుత ప్లేయర్లపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆట తీరు మార్చుకోకపోతే జట్టు పరిస్థితి మరింత అద్వానంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.. అయితే పాక్ ఓటమిపై ఆ దేశ మీడియా మరో విధంగా స్పందిస్తోంది.
పాకిస్తాన్లోని ఓ న్యూస్ ఛానల్ ఇండియా తో ఎదురైన ఓటమి గురించి చర్చ నిర్వహించింది. ఇందులో క్రికెట్ విశ్లేషకులు పాల్గొన్నారు.. ఇండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోవడానికి చేతబడి కారణమని విచిత్రంగా ఆరోపణలు చేశారు..” పాకిస్తాన్ ఓడిపోవడానికి భారత్ 22 మంది పండితులను దుబాయ్ కి తీసుకొచ్చిందని నాకు స్పష్టమైన సమాచారం ఉంది. ఇద్దరు పండితులు ఒక్కో ఆటగాడి పై చేతబడి చేస్తారు. దీనివల్ల ఆటగాళ్లు ఏకాగ్రత కోల్పోతారు. తీవ్రంగా ఇబ్బంది పడతారు. అందువల్లే పాకిస్తాన్ ఓడిపోయింది. పండితులను తీసుకురావడానికి వీలు కాదు కాబట్టే భారత్ పాకిస్తాన్ రావడానికి ఇష్టపడలేదు. పాకిస్తాన్లో ముస్లింలు చాలామంది ఉన్నారు కాబట్టి.. భారత పండితుల చేతబడి ఇక్కడ పనిచేయదు. 2024 లో కూడా ఇలానే చేశారు. భారత్ దుబాయ్ రావడానికి ముందే ఆ పండితులు అక్కడికి వచ్చేసారు. వారికోసం ముందుగానే ఏర్పాట్లు చేశారు. హార్థిక్ పాండ్యా చేతులకు ఏవో తాయతులున్నాయి. అతడు మంత్రాలు చదవడం చూశాను. అతడు చూసేందుకు మంత్ర గాడి లాగానే ఉన్నాడు. అందువల్లే అతడు వికెట్ తీయగలిగాడని” పాక్ క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు..
అయితే పాకిస్తాన్లో ఇలాంటి వితండవాదాలు తెరపైకి రావడం ఇది తొలిసారి కాదు. గతంలో పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఐసిసి పైనే ఆరోపణలు చేశారు. భారత జట్టుకు ఒక మైదానం.. ఇతర బంతులు అందిస్తూ మోసం చేస్తోందని ఐసిసి పై వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఖండించారు. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరువు తీయకూడదని హెచ్చరించారు.. ఇక ఐసిసి కూడా ఆ విషయంపై తీవ్రంగానే స్పందించింది. బుర్రలో గుజ్జు లేకుండా మాట్లాడితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.