India vs Pakistan : టి20 ప్రపంచ కప్ లో భారత్ పై విజయం సాధించాలని పాకిస్తాన్ కల కలగానే మిగిలిపోయింది. మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ ఎన్నో అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుని, ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. గత వరల్డ్ కప్ లో చోటు చేసుకున్న సన్నివేశమే.. ఈసారి కూడా పునరావృతమైంది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ భారత్ కంటే పాకిస్తాన్ గెలిచేందుకే ఆస్కారం ఎక్కువగా ఉంది. విన్నింగ్ ప్రిడిక్షన్ కూడా అదే చూపించింది. తీరా గెలిచే సమయానికి పాక్ బ్యాటర్లు భారత బౌలర్ల ఎదుట తలవంచడంతో దాయాది దేశానికి ఓటమి తప్పలేదు.
ఈ ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాడు నసీం షా గుక్క పెట్టి ఏడ్చాడు. భారత చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ చివరి బంతి ముగియగానే.. ఒక్కసారిగా నేల కూలిన నసీం.. వెంటనే ఏడుపు ముఖం పెట్టాడు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఏమాత్రం ఆపుకోలేకపోయాడు.. భారంగా అడుగులు వేస్తూ డ్రెస్సింగ్ రూమ్ వైపు ప్రయాణం కొనసాగించాడు. నసీం అలా ఏడవడాన్ని చూసి తోటి క్రికెటర్ ఆఫ్రిది ఓదార్చాడు..” నువ్వు ఏడవకు.. కచ్చితంగా మనకు అవకాశం వస్తుంది. ఆటలో దమ్ము చూపించాలి. ఇలా ఏడిస్తే ఉపయోగం ఉండదు. కసితో ఆడాలి. అప్పుడే ప్రత్యర్థి ఆటగాళ్లు మనల్ని చూసి ఏడుస్తారంటూ” ఆఫ్రిది అనునయించాడు.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 119 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మందకొడిగా మారిన మైదానంపై పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోయారు. రౌఫ్, నసీమ్ షా చెరి మూడు వికెట్లు, అమీర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఏస్ బౌలర్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడికి హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తోడు కావడంతో పాకిస్తాన్ గెలుపు ముందు బోర్లా పడింది. ఒకానొక దశలో ఒక వికెట్ నష్టానికి 58 పరుగులు చేసిన పాకిస్తాన్ జట్టు.. తదుపరి వికెట్లను వెంటవెంటనే కోల్పోవడంతో ఓటమిపాలైంది.. విన్ ప్రిడిక్షన్ 8 మాత్రమే ఉన్న భారత్.. ఈ మ్యాచ్లో గెలవడం పట్ల సర్వత్రా అభినందనల జల్లు కురుస్తోంది.
Even Naseem Shah, our young bowler, played better than our highly paid batsmen. The time has come, if you’re not performing well, please resign gracefully and let others join. It’s time to take strict decisions, or they’ll never understand. #PakvsIndpic.twitter.com/kkV9LZntFX
— Saad Kaiser (@TheSaadKaiser) June 9, 2024