Pakistan Vs UAE Asia Cup 2025: యూఏఈ గనక సమర్థవంతంగా ఆడి ఉంటే ఈ సమయం వరకు పాకిస్తాన్ కథ ఆసియా కప్ లో ముగిసిపోయేది. ఎక్కడో సుడి ఉంది కాబట్టి పాకిస్థాన్ కు ఇంకా ఆసియా కప్ లో కొనసాగుతోంది. అలాగని పాకిస్తాన్ గొప్ప ప్రదర్శన చేసిందని కాదు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ ఒకదాంట్లో ఓడిపోయింది. మిగతా రెండిట్లో చచ్చి చెడి గెలిచింది. చివరికి భారత జట్టుతో షేక్ హ్యాండ్ విషయాన్ని అనవసరమైన వివాదంగా మార్చింది. దాని ద్వారా ఏదో లబ్ధి పొందుకోవాలని భావించి.. చివరికి నగుబాటుకు గురైంది.
Also Read: మౌనం వీడిన ధర్మాన.. క్లారిటీ ఇచ్చినట్టేనా?
సెప్టెంబర్ 14న పాకిస్తాన్ జట్టు భారత జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం అనంతరం భారత జట్టు సారధి సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిని నామోషీగా భావించిన పాకిస్తాన్ ప్లేయర్లు రకరకాల మాటలు మాట్లాడారు. పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు రచ్చ రచ్చ చేశారు. ఏకంగా ఐసిసి దృష్టికి తీసుకువెళ్లారు. మ్యాచ్ రిఫరీ విషయంలో కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి బుధవారం యూఏఈ జట్టుతో జరిగే మ్యాచ్ ముందు కూడా రాద్ధాంతం చేయబోయారు. చాలా సమయం వరకు మైదానంలోకి రాలేదు. హోటల్ గదులకే పరిమితమయ్యారు. దీంతో పాకిస్తాన్ జట్టు ఆసియా కప్ నుంచి వెళ్ళిపోతుందని ప్రచారం జరిగింది. అలా వెళ్ళిపోతే పాకిస్తాన్ మేనేజ్మెంట్ దాదాపు 100 కోట్లకు పైగా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. పైగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగోలేదు. అందువల్లే అనవసరమైన వివాదానికి వెళ్లడానికంటే నిశ్శబ్దంగా మూసుకొని కూర్చోవడమే బెటర్ అని పాకిస్తాన్ మేనేజ్మెంట్ భావించింది.
పైకి వాస్తవం అలా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది పాకిస్తాన్ జట్టు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధిపతి మోహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆసియా క్రికెట్ కప్ నుంచి పక్కకు తప్పుకుందామని పాకిస్తాన్ జట్టు భావించిందని.. పాకిస్తాన్ జట్టుకు అన్ని వర్గాల సపోర్టు ఉందని, అయితే అలా చేయడం తమకు ఇష్టం లేదని, అందువల్లే టోర్నీలో కొనసాగామని నక్వి చెప్పుకొచ్చారు. అంతే కాదట షేక్ హ్యాండ్ వివాదాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తే విచారం వ్యక్తం చేసిందట.. నిక్వీ మాట్లాడిన మాటలు పాకిస్తాన్ అభిమానులకు బాగుంటాయేమో గాని.. మిగతా వాళ్లకు అంతగా నప్పవు.. ఇదే పాకిస్తాన్ మేనేజ్మెంట్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును పాకిస్తాన్ గడ్డపై ఆడించడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరి వరకు ప్రయత్నించింది. ఒకానొక దశలో తమ మాజీ ఆటగాళ్లతో కూడా రాయబారాలు పంపింది. అయినప్పటికీ ఉపయోగాలు లేకుండా పోయింది. భారత్ దయ లేకుండా కనీసం క్రికెట్ ఆడలేని ఆ జట్టు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా హాస్యాస్పదం. దీనినే దయ్యాలు వేదాలు వల్లించడం అంటారేమో.