AP Plastic Ban: ఏపీ ప్రభుత్వం( AP government ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ ను నిషేధించింది. పర్యావరణ హితం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో చెత్తను పూర్తిగా తొలగిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ పథకంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. మితిమీరిన ప్లాస్టిక్ వినియోగంతో ఎన్నెన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు సంభవిస్తున్నాయి. పర్యావరణం సైతం కాలుష్య భరితంగా మారుతోంది. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధం విధించి.. క్రమేపి అంతటా విస్తరించాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.
Also Read: మౌనం వీడిన ధర్మాన.. క్లారిటీ ఇచ్చినట్టేనా?
పెరుగుతున్న వినియోగం..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్( plastic) వినియోగం అధికంగా ఉంది. ఏపీలో సైతం వీటి వినియోగం అధికమే. మనిషి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనిలో ప్లాస్టిక్ వినియోగం పెరిగింది. దీంతో ప్లాస్టిక్ తో ఎన్నెన్నో అనర్ధాలు పెరుగుతున్నాయి. వెయ్యి సంవత్సరాలైనా భూమిలో కలవనిది ప్లాస్టిక్. అటువంటి ప్లాస్టిక్ వినియోగం పెరగడంతోనే అనేక రకాల రుగ్మతలు తలెత్తుతున్నాయి. పర్యావరణ కాలుష్యం పెరగడానికి కూడా ప్రధాన కారణం ప్లాస్టిక్. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్లాస్టిక్ పై నిషేధం కఠినంగా విధించాలని భావించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ పై నిషేధానికి కఠిన ఆంక్షలు విధిస్తోంది. కానీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో.. ప్రభుత్వ శాఖల నుంచి ఈ ప్రక్షాళన ప్రారంభించాలని భావించింది.
* మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా..
ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో( government offices) ప్లాస్టిక్ నిషేధిస్తారు. అక్టోబర్ రెండు నుంచి కనీసం ఒక్క ప్లాస్టిక్ వస్తువు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించకూడదు. అలా కనిపిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా ఇది అమలు చేస్తారు. అటు తరువాత ప్రైవేటు కార్యాలయాలతో పాటు సంస్థల్లో సైతం ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రారంభిస్తారు. ప్లాస్టిక్ రహిత ఏపీ గా మార్చడమే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది. అయితే గత ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ పై నిషేధం విధించాయి. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ప్రభుత్వ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో..