Champions Trophy 2025: పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ(Champions trophy 2025) 19 రోజులపాటు సాగనుంది. 15 మ్యాచ్లతో ఈ మినీ వరల్డ్ కప్ కథ ముగియనుంది. అయితే ఈ పోరులో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 8 సంవత్సరాల విరామం తర్వాత ఈ మెగా టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిగతా జట్లు ఆడే మ్యాచ్ లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. భారత్ ఆడే మ్యాచ్ లకు మాత్రం దుబాయ్ వేదికగా నిలవనుంది. ఈ టోర్నీలో భారత్ నుంచి మొదలు పెడితే మిగతా అన్ని జట్లు బలంగా కనిపిస్తున్నాయి. విజేత ఎవరో అంచనా వేయడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ – న్యూజిలాండ్ ( PAK vs NZ) తలపడుతున్నాయి. కరాచీ నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభం కానుంది.. ఇక ఈ టోర్నీలో 8 జట్లు ఆడతాయి. అయితే వెస్టిండీస్, శ్రీలంక జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి.
1996 తర్వాత
పాకిస్తాన్ జట్టు 1996లో భారత్ – శ్రీలంకతో కలిసి వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు పాకిస్తాన్లో ఐసీసీ మరో టోర్నీ నిర్వహించలేదు. అయితే అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో తమ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పాకిస్తాన్ భావిస్తున్నది. సొంత గడ్డపై పాకిస్తాన్ భారీ అంచనాల మధ్యలో దిగుతోంది. టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇటీవల జరిగిన ట్రై సిరీస్లో పాకిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచ్లలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ట్రై సిరీస్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టులో విలియంసన్, కాన్వే, మిచెల్, లేథమ్, ఫిలిప్స్ నిలకడగా రాణిస్తున్నారు. ఫిలిప్స్ బంతితో, బ్రేస్ వెల్, సాంట్నర్ బ్యాట్ తో అదరగొట్టగలరు.. ట్రై సిరీస్ కాస్త పక్కన పెడితే పాకిస్తాన్ కూడా ఇటీవల మెరుగ్గానే ఆడుతోంది. బాబర్ ఆజాం, ఫకర్ జమాన్, రిజ్వాన్, సల్మాన్ ఆఘా లతో కూడిన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. షాహిన్ ఆఫ్రిది, హారీస్ రౌఫ్, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ తో కూడిన పాకిస్తాన్ బౌలింగ్ బలంగా ఉంది. అయితే ఇప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పరిస్థితి పాకిస్తాన్ జట్టుకు అత్యంత ప్రతికూలం. కరాచీ మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. ఈ మైదానం బ్యాటింగ్ కు కూడా స్వర్గధామంలా ఉంటుంది.