Pakistan Women Odi World Cup 2025: అనువు గాని చోట అధికుల మన రాదు. ఈ విషయం పాకిస్తాన్ ఉమెన్ క్రికెటర్లకు ప్రస్తుత ఉమెన్స్ వరల్డ్ కప్ లో అనుభవంలోకి వచ్చింది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెటర్లు రెచ్చిపోయారు. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాము ఉమెన్స్ వరల్డ్ కప్ లో విజేతలుగా నిలిస్తే.. ఐసీసీ చైర్మన్ జై షా చేతుల మీదుగా ట్రోఫీ అందుకోబోమని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ కెప్టెన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. “అసలు వీళ్లకు గెలిచే అవకాశం ఉందా.. అసలు జట్టులో ఏమాత్రం సత్తా చూపించలేని ఆటగాళ్లు ఉన్నారు.. ఇటువంటి జట్టు ట్రోఫీ ఎలా గెలుస్తుందని” అందరూ విస్మయానికి గురయ్యారు.
పాకిస్తాన్ కెప్టెన్ చేసినట్టుగా ఆ జట్టు ప్రదర్శన ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో సాగలేదు. పాకిస్తాన్ జట్టు తను ఆడే మ్యాచ్ లు మొత్తం శ్రీలంక వేదికగా తలపడింది. ఈ వేదికపై ఏ ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ జట్టు గెలవలేదు. లీగ్ దశలో పాకిస్తాన్ జట్టు తన చివరి మ్యాచ్ శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. అది వర్షం వల్ల రద్దయింది. పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. శ్రీలంక, పాకిస్తాన్ సెమిస్ రేసు నుంచి తప్పుకున్నాయి. మొత్తం ఏడు మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఒక్కటి కూడా గెలవలేదు. మొత్తం నాలుగు మ్యాచ్లు పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. మూడు మ్యాచులు వర్షం వల్ల రద్దయ్యాయి. ఫలితంగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టుగా దారుణమైన అవమానాన్ని పాకిస్తాన్ జట్టు మూట కట్టుకుంది.
భారత జట్టుతో తలపడిన మ్యాచ్లో పాకిస్తాన్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ లో బలమైన అడుగులు వేసింది. అంతకుముందు టీమిండియా శ్రీలంక మీద ఘనవిజయాన్ని అందుకుంది. ఈ రెండు విజయాలు సాధించిన తర్వాత.. టీమిండియా వరుసగా మూడు మ్యాచ్లలో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ పై ఘనవిజయాన్ని సాధించి టీమిండియా సెమీఫైనల్ చేరుకుంది. లీగ్ దశలో టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో చివరి మ్యాచ్ ఆడనుంది. పాక్ దారుణంగా ఓడిపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ” జై షా తో ట్రోఫీ తీసుకోబోమని చెప్పారు కదా. ఇప్పుడు నఖ్వీ తో సున్నా కప్ తీసుకోండి.. అప్పుడు మీకు సమ్మగా ఉంటుందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.