Pakistan cricket : శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా చూశారా.. అందులో చిరంజీవి పరేష్ రావెల్ ను ఉద్దేశించి ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్.. అని అంటుంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కూడా ఐసీసీ నుంచి ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. టి20 వరల్డ్ కప్ లో టీమిండియాతో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ చెప్పిన నేపథ్యంలో.. పరిస్థితులు మొత్తం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎదురు తంతున్నాయి.
పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఆర్థికంగా.. ఇంకా అనేక రకాలుగా జట్టుకు తీవ్రమైన నష్టం కలిగించే అవకాశాలు కనిస్తున్నాయి. అంతేకాదు, భవిష్యత్ కాలంలో పాకిస్తాన్ జట్టు మరింత ఒత్తిడి ఎదుర్కొనే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ దేశం తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎదురయ్యే నష్టాలను క్రికెట్ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది రకరకాలుగా విశ్లేషణ చేశారు. వారందరూ చెప్పిన సమాచారాన్ని క్రోడీకరిస్తే.. పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తు కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహిస్తేనే భయంగా ఉంది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడే అవకాశం లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఐసీసీ కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుంది. ముఖ్యంగా టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ జట్టును పూర్తిగా బహిష్కరించే ప్రమాదం లేకపోలేదు. అంతేకాదు వార్షిక ఆదాయాన్ని ఐసిసి పంపిణీ చేయకుండా నిలిపివేస్తుంది. ద్వైపాక్షిక సిరీస్ లలో అనేక రకాలుగా ఐసీసీ ఆంక్షలు విధిస్తుంది. ర్యాంకులు, డబ్ల్యూటీసి పాయింట్ల వంటి వాటిల్లో కూడా ఐసీసీ కఠినమైన నిబంధనలు విధిస్తుంది. అంతేకాదు, భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ చేసిన నేపథ్యంలో.. జియో హాట్ స్టార్ కోల్పోయిన ఆదాయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొలంబోలో ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. అంతేకాదు ఈ మ్యాచ్ నేపథ్యంలో ఈ యాడ్ స్లాట్ లు కూడా బుక్ అయ్యాయి. వీటిని భారీ ధరకు అనేక కంపెనీలు బుక్ చేసుకున్నాయి. ఇప్పుడు మ్యాచ్ రద్దు అవుతుంది కాబట్టి జియో హాట్ స్టార్ కు ఊహించిన ఆదాయం రాదు. పైగా యాడ్ స్లాట్ లు క్యాన్సిల్ అవుతాయి. తద్వారా జియో హాట్ స్టార్ భారీగా ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కేవలం జియో హాట్ స్టార్ మాత్రమే కాదు.. ఐసీసీ కూడా భారీగా ఆదాయాన్ని నష్టపోతుంది. అలాంటప్పుడు ఈ నష్టాన్ని అటు ఐసిసి.. ఇటు జియో హాట్స్టార్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి వసూలు చేసే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.