Babar Ajam : పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వన్డే వరల్డ కప్ మధ్యలోనే జట్టు కోస్ ఇంజమామ్ వైదొలగగా, రెండు రోజుల క్రితం బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ రాజీనామా చేశారు. తాజాగా రాజీనామాల కొనసాగింపుగా ఆ జట్టు సారథి బాబర్ కూడా వైదొలిగార. పాకిస్థాన్ జట్టు ప్రపంచ కప్ 2023లో చాలా పేలవంగా ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని బాబర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. వరల్డ్‌కప్ 2023 టోర్నీలో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘోరంగా విఫలం కావడంతో.. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్‌ల నుంచి తాను కెప్టెన్ గా రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు.
మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై..
‘ఈరోజు నేను మూడు ఫార్మాట్లలో పాక్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ, ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను’అని బాబర్ ఆజం ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ‘నేను మూడు ఫార్మాట్లలో ఒక ఆటగాడిగా పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తాను. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‌కి, జట్టుకు మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. ‘వైట్ బాల్ ఫార్మాట్‌లో నంబర్ వన్‌కు చేరుకోవడం కోచ్, ఆటగాళ్లు, టీమ్ మేనేజ్‌మెంట్ సమష్టి కృషితోనే సాధ్యమైంది. అయితే ఈ ప్రయాణంలో వారి తిరుగులేని మద్దతు కోసం ఉద్వేగభరితమైన పాకిస్తానీ అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నాడు.
ఆటగాడిగా కొనసాగుతానని..
కెప్టెన్సీకి రిజైన్ చేసిన బాబర్ జట్టులో ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని తెలిపారు. ‘నేను ఒక ఆటగాడిగా మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ తరపున ఆడటం కొనసాగిస్తాను. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‌కు, జట్టుకు మద్దతునిస్తూనే ఉంటాను. ఈ విశేషమైన బాధ్యత కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ తెలిపాడు.
2019లో కెప్టెన్‌గా బాధ్యతలు..
2019లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాలని పీసీబీ నుంచి తనకొచ్చిన పిలుపు ఇంకా గుర్తుందని, ఈ నాలుగేళ్లలో తాను ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానన్నాడు. క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ గర్వాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని బాబర్ తెలిపాడు. ఈ ప్రయాణంలో తనకు తిరుగులేని మద్దతిచ్చిన క్రికెట్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. బాబర్ ఆజం 20 టెస్టు మ్యాచ్‌లకు పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే, 43 వన్డేలకు, 71 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించాడు.
వరల్డ్ కప్‌లో విఫలం..
కాగా.. వరల్డ్‌కప్ 2023 మెగాటోర్నీలో పాకిస్థాన్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చింది. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ జట్టు విఫలమైంది. అందుకే.. ఈ మెగాటోర్నీలో పెద్దగా రాణించలేక, సెమీస్‌కి చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఇక బాబర్ ఆజమ్ గురించి మాట్లాడితే.. అతడు మొత్తం 9 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 320 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు బాబర్ ఆజమ్ కెప్టెన్సీ పదవికి స్వస్తి పలికాడు కాబట్టి, అతని స్థానంలో ఎవరికీ ఆ బాధ్యతలు అప్పగిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
— Babar Azam (@babarazam258) November 15, 2023