Homeక్రీడలుPAK Vs USA T20 World Cup 2024: పాక్ పతనాన్ని శాసించిన ఇండియన్ అమెరికన్లు...

PAK Vs USA T20 World Cup 2024: పాక్ పతనాన్ని శాసించిన ఇండియన్ అమెరికన్లు…

PAK Vs USA T20 World Cup 2024: ” మాకు 40 నిమిషాలు చాలు పాకిస్తాన్ జట్టును మట్టి కరిపిస్తాం. గట్టిగా ఆట మీద ఫోకస్ చేస్తే చాలు పెద్దగా ఇబ్బంది ఉండదు. మైదానాన్ని అంచనా వేసుకుని.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో సమర్థవంతంగా వ్యవహరిస్తే చాలు పెద్దగా ఇబ్బంది ఉండదు” ఇవీ పాకిస్తాన్ జట్టుతో టి20 మ్యాచ్ ప్రారంభానికి ముందు అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు.. అతడు అలా మాట్లాడుతుంటే చాలామంది అతి విశ్వాసం అనుకున్నారు.. ఇతడు ఏం చేయగలడులే అని లైట్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత గాని తెలిసింది.. అమెరికా కెప్టెన్ వి మాటలు కావు, చేతలని. టి20 లో ర్యాంకింగ్స్ లో ఆరవ స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టును.. 18వ స్థానంలో ఉన్న అమెరికా మట్టి కరిపించిందంటే మామూలు మాటలు కావు. అయితే ఈ సూపర్ విజయం వెనుక ఉంది ముమ్మాటికి అమెరికన్ భారతీయులు.

బేస్ బాల్, ఫుట్ బాల్, టెన్నిస్ వంటి క్రీడలను మాత్రమే అమెరికన్లు ఆరాధిస్తుంటారు. అక్కడ క్రికెట్ కు ఆదరణ అంతంత మాత్రమే. స్థానిక యువకులు క్రికెట్ ఆడేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అందువల్ల వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులతో అమెరికా తన క్రికెట్ జట్టును రూపొందించింది. ఇందులో భారతీయ మూలాలు ఉన్న క్రీడాకారులే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం అమెరికా జట్టుకు నాయకత్వం వహిస్తున్న మోనాంక్ పటేల్ భారతీయ మూలాలు ఉన్న అమెరికనే.

పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారతీయ మూలాలు ఉన్న క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. అందువల్లే పాకిస్తాన్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఏకంగా టై దాకా తీసుకొచ్చారు.. ముఖ్యంగా బ్యాటింగ్ లో అమెరికా జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ (50), నితీష్ (14), బౌలింగ్ లో సౌరభ్ నేత్రావల్కర్ (2/18), జస్దీప్ సింగ్(1/37) రాణించారు. ఫలితంగా అమెరికా జట్టు పాకిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో టై దాకా తీసుకొచ్చారు.

మ్యాచ్ టై అయిన అనంతరం సూపర్ ఓవర్ లోనూ భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సూపర్ ఓవర్ లో పాకిస్తాన్ బౌలర్ అమీర్ వైడ్ల మీద వైడ్లు వేశాడు.. కానీ సౌరభ్ మాత్రం తన లయను కోల్పోలేదు.. ఈ ఓవర్ లో రెండవ బంతిని పాకిస్తాన్ బ్యాటర్ ఇఫ్తికార్ ఫోర్ కొట్టినప్పటికీ.. తర్వాత బంతికి అతడిని అవుట్ చేశాడు..మిగతా మూడు బంతులనూ వైవిధ్యంగా సంధించడంతో పాకిస్తాన్ తలవంచాల్సి వచ్చింది. చివరికి అమెరికా చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది.

టి20 క్రికెట్లో పూర్తిస్థాయి సభ్యత్వం లేకపోయినప్పటికీ మోనాంక్ పటేల్ నేతృత్వంలోని అమెరికా జట్టు పక్కా ప్రొఫెషనలిజం ప్రదర్శించింది. డల్లాస్ వేదికపై తేమను వినియోగించుకుంటూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. దీంతో పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి, నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ జట్టులో బాబర్ అజాం(44), షాదాబ్ ఖాన్(40), ఇఫ్తికార్ అహ్మద్ (18), షాహిన్ అఫ్రిది (23) మాత్రమే రాణించారు. రిజ్వాన్ (9), ఉస్మాన్ ఖాన్ (3), ఫకర్ జమాన్(11), అజాం ఖాన్(0) వంటి వారు తేలిపోయారు.

ఇటీవల టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ అమెరికాలో పర్యటించింది. మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో అమెరికా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. ట్రోఫీని దక్కించుకుంది. పూర్తిస్థాయిలో టి20 క్రికెట్లో సభ్యత్వం లేకపోయినప్పటికీ.. ఒక టెస్ట్ క్రికెట్ జట్టును మట్టికరిపించింది అమెరికా జట్టు. ఇటీవల టి20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్లో కెనడా జట్టుపై రికార్డు స్థాయిలో ఛేజింగ్ చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు అదే ఊపును అమెరికా మీద కూడా కొనసాగించింది. మొత్తానికి తమది పసికూన జట్టు కాదని.. కసితో ఆడే జట్టు అని నిరూపించింది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version