Pak Vs Aus 2nd T20: పాకిస్తాన్ మీద టీ 20 లలో ఆస్ట్రేలియా జట్టుకు మెరుగైన రికార్డు ఉంది. పైగా అనేక సిరీస్ లను ఆస్ట్రేలియా గెలిచింది. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలే కాదు.. ద్వైపాక్షిక సిరీస్ లలో కూడా ఆస్ట్రేలియా దే పాకిస్తాన్ మీద పై చేయి.
ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఆస్ట్రేలియా పర్యటిస్తోంది. మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. వాస్తవానికి ఈ సిరీస్ కు ముందు పాక్ జట్టు పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. జట్టులో అంతర్గత సమస్యలు.. ఆటగాళ్ల ఫామ్ లేమి పాకిస్తాన్ జట్టును ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు సిరీస్ గెలుస్తుందని అందరు అనుకున్నారు. కానీ, పాక్ గడ్డమీద అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆస్ట్రేలియా జట్టు సిరీస్ గెలవాల్సింది పోయి.. పాకిస్తాన్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది.
3 t20 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ లాహోర్ గడాఫీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు 146 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తద్వారా పాకిస్తాన్ జట్టు 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
శనివారం లాహోర్ మైదానంలోని జరిగిన రెండవ టి20 మ్యాచ్లో పాక్ ఈసారి ఏకంగా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్హాన్ (5), అయూబ్(23) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ సల్మాన్ (78) సత్తా చూపించాడు. ఉస్మాన్ ఖాన్ (53) అదరగొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్లు అంతగా ప్రతిభ చూప లేకపోయారు. జంపా మాత్రమే కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశాడు.
ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు 108 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా జట్టులో గ్రీన్ (35) మాత్రమే టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. ఉస్మాన్ తారిఖ్ రెండు వికెట్లు సాధించాడు. 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు.. ఏ దశలో కూడా కోలుకోలేదు.