BRS B Forms: ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకటించక ముందే అభ్యర్థుల పేర్లను వెల్లడించి భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ సంచలనం సృష్టించారు. 2018 ఎన్నికలకు ముందుగానే ఇప్పుడు కూడా అలాంటి పంథానే అనుసరించారు. ఏకంగా 115 మంది పేర్లను ప్రకటించి ప్రతిపక్ష పార్టీలకు కోలుకోలేని షాకిచ్చారు. ఆ 115 మంది లో ఒకరు పార్టీ మారారు. ఆ 114 మందికి ఆదివారం బీ పామ్స్ పంపిణీ చేస్తామని గులాబీ పార్టీ అధినేతలు సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల ఖర్చులకు చెక్కులు కూడా అందజేస్తామని సమాచారం అందించారు. గులాబీ పార్టీ వర్గాలు చెప్పిన విధంగానే పార్టీ అభ్యర్థులు ఆదివారం ఉదయమే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో భేటీ. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. అయితే అంతకుముందు అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఎవరైనా పార్టీ లైన్ దాటితే తోక కట్ చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆ హెచ్చరికల నేపథ్యంలో కొంతమంది పేర్లను మారుస్తారని ప్రచారం జరిగింది. ఆదివారం ఉదయం కూడా అభ్యర్థులు ఒకింత ఆందోళనతోనే కనిపించారు.
ఆదివారం భేటీ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 51 మందికి మాత్రమే బి ఫామ్స్ అందజేశారు. కేవలం అవి మాత్రమే పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని.. మిగతా వారికి త్వరలో ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గత ఆగస్టు 21న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించే సమయంలో పార్టీ లైనుకు ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తే రెండో మాటకు తావు లేకుండా బయటికి పంపిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. 50 రోజుల తర్వాత ఆదివారం అభ్యర్థులకు బీ పామ్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే కేవలం 51 మందికి మాత్రమే పార్టీ బీ ఫామ్స్ అందజేశారు. అంటే ఈ లెక్కన కొంతమందికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ, ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీ లో బీ పామ్స్ సిద్ధంగా లేకపోవడం ఏంటనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బీ ఫామ్స్ ఇవ్వకపోవడంతో మిగతా అభ్యర్థులు ఆవేదనలో కూరుకు పోయారు.
అయితే అసంతృప్తులు బయటకు వెళ్లకుండా నియంత్రించేందుకు కేసిఆర్ ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రతికూల నివేదికలు రావడంతో.. వారిని మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది..51 బీ పామ్స్ సిద్ధంగా ఉండగా.. అవి ఎవరెవరికి ఇచ్చారు అనేది ఆసక్తికరంగా మారింది. కొందరి అభ్యర్థుల విషయంలో పార్టీలోనే అసంతృప్తులు వ్యక్తమవుతుండడం వంటి కారణాలతోనే కేసీఆర్ బీ పామ్స్ ఇతని తెలుస్తోంది. మరోవైపు మరో రెండు రోజుల్లో మిగతా వారికి కూడా ఇస్తామని కేసీఆర్ చెప్పినప్పటికీ.. ఏదో జరుగుతోంది అనే అనుమానాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.